*నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం*( రాధారపు నర్సయ్య )’థాంక్స్ రా..ఫ్రెండ్సూ..’ నాకు చాలా గుణపాఠం చెప్పారు.! జీవితాంతం గుర్తుపెట్టుకుంటా.! అట్లనే మీరూ ‘చెక్’ చేసుకోండీ దోస్తులూ..’స్నేహం’ ముసుగులో కొందరు మన వెనకే ఉండి బొందతోడి పెడతారని ఓ ‘స్నేహితుడు’ తన మనసులో మాటను ‘కరపత్రాల’ రూపంలో ప్రచారం చేసుకుంటున్న వైనం చర్చానీయాంశమైంది.!*నా ఓటమికి కారణం నా దోస్తుగాళ్లే.!*ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి 6వ వార్డు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, అక్కడి రాజకీయ వాతావరణంలో ఒక కొత్తరకమైన కదలిక కనిపించింది. ఓటమిని ఒప్పుకుంటూనే, తన గుండెల్లో దాగిన భావోద్వేగాలను బహిరంగంగా చెప్పిన అభ్యర్థి ‘మొగిలి దేవదాస్’ మాటలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. గెలుపు–ఓటముల మధ్య నిలిచే నిజమైన బంధాల విలువను గుర్తుచేసేలా ఆయన స్పందన ఉండటం ప్రత్యేకతగా నిలిచింది.ఈ ఎన్నికల్లో తన విజయానికి శ్రమించిన ప్రతి ఓటరికి, మద్దతుగా నిలిచిన ప్రతి వ్యక్తికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి తన వ్యక్తిగత పరాజయం కాదని, ప్రజాస్వామ్యంలో అది ఒక సహజ ప్రక్రియ అని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఈ పోటీ తనకు ఓ చేదు అనుభవాన్నీ మిగిల్చిందని, దశాబ్దాలుగా కొనసాగిన స్నేహబంధాలు ఒక్క వార్డు ఎన్నిక కారణంగా దూరమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్నేహమనే ముసుగులో నా ఓటమికి కారణమైన మిత్రులకూ ప్రత్యేక ధన్యవాదాలు’అన్న మాటలు, రాజకీయ పోరాటాల్లో దాగి ఉండే నిజాలను బయటపెట్టినట్లయ్యాయి.*గుండెల్ని పిండేసిన ‘విజ్ఞప్తి’*చివరగా ఆయన చేసిన విజ్ఞప్తి మాత్రం హృదయాన్ని తాకేలా ఉంది. స్నేహం అనే పదాన్ని ఉపయోగించి ఎవరినీ తొక్కివేయొద్దని, అవసరమైతే దూరంగా ఉండొచ్చుగానీ అన్యాయం మాత్రం చేయవద్దని కోరారు. ఓటమి తర్వాత కూడా తనను ‘సదా మీ శ్రేయభిలాషి’గా పరిచయం చేసుకోవడం, రాజకీయాలకతీతంగా మనిషితనాన్ని నిలబెట్టే ప్రయత్నంగా పలువురు భావిస్తున్నారు. వేములకుర్తి 6వ వార్డులో ఈ మాటలు ఓ ఎన్నికల కథకు తెరలేపినట్టుగా, లోతైన ఆలోచనలకు దారి తీస్తున్నాయి.!_____





