నేటి సాక్షి, ఎండపల్లి:* ఈనెల 28న హైదరాబాద్ లోని తెలుగు విశ్వ విద్యాలయంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు మేకల రాములు యాదవ్ అధ్యక్షతన నిర్వహించనున్న దక్షిణ భారత యాదవ ప్లీనరీని యాదవులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి బైకని రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే యాదవ సామాజిక వర్గం, బీసీ కులాల సమస్యలు పరిష్కారం అవుతాయని, రాజ్యాధికారం దిశగా యాదవులు, బీసీలంతా పయనించాలని, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 18 శాతం జనాభా కలిగిన యాదవులకు జనాభా దామాషా ప్రకారంగా మంత్రి పదవి ఇవ్వాలని, చట్టసభల్లో యాదవులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఏడాదికి రూ.500 కోట్లు కేటాయించాలని, 50 సంవత్సరాలు దాటిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ చైతన్యం, విద్య, సామాజిక ఐక్యతతోనే ఆత్మగౌరవం నిలుస్తుందని, ఉద్యమాల ద్వారానే హక్కులు సాధ్యమవుతాయని, ఈ విషయాలపై యాదవులకు అవగాహన కల్పించేందుకే దక్షిణ భారత యాదవ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు రవీందర్ స్పష్టం చేశారు.





