Wednesday, March 18, 2026

– దిక్కు లేకుండా చేశావు. ఇక మాకు దిక్కెవరు..- కుటుంబ సభ్యుల రోదనలతో కాటికి సాగనంపు..- కుమార్తె వివాహ పెళ్లి పత్రికలు పంచి స్వగ్రామానికి తిరిగి వస్తూ మృత్యువాత..- పది రోజుల్లో పెళ్లి అంతలోనే తిరిగిరాని లోకాలకు..- నిరుపేద కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి గ్రామస్తుల వేడుకోలు..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 20~అన్నమయ్య జిల్లా :- కన్న కూతురు పెళ్లి కళ్లారా చూడాలనుకున్నాడు. కూతురుని, అల్లుడిని చూసి ఎంతో మురిసిపోవాలనుకున్నాడు. తన చేతులతో దీవించాలని ఎంతో కలగన్నాడు. ఇవన్నీ ఏవి నెరవేరలేదు. కూతురి వివాహ పత్రికలు పంచేందుకు పొద్దుగాకనే వెళ్ళాడు. బంధువులను మిత్రులను కలిసి కూతురు పెళ్లికి అందరూ రావాలని పెళ్లి పత్రిక అందించి వారితో సరదాగా గడిపాడు. అందరికీ వీడ్కోలు చెబుతూ ద్విచక్ర వాహనంలో ఇక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో మృత్యువు వెంటాడింది. శుక్రవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న విషాద గాధ. కుటుంబ సభ్యులను పట్టరాని రోధనకు గురిచేసింది. ఆయన మృతి గ్రామంలోని అందరినీ కదిలించింది. ములకలచెరువు నుండి స్వగ్రామమైన మద్దయ్యగారిపల్లి కు ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో నాయుని చెరువుపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాసీం 38 అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ములకలచెరువు ఎస్ఐ నరసింహుడు తెలిపిన కథనం మేరకు మద్దయ్యగారి పల్లి గ్రామానికి చెందిన ఖాసీం వల్లి అనే వ్యక్తి కుమార్తె వివాహానికని బంధువులందరికీ వివాహ పత్రికలు పంచి తిరిగి వెళ్తుండగా నాయుని చెరువుపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే టెంపోను తప్పించు పోయే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు బి. కొత్తకోట మండల కేంద్రమైన బుచ్చి రెడ్డి గారి పల్లి నారాయణస్వామి 55 అనే వ్యక్తిని ఢీకొట్టాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఖాసీం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక్క ద్విచక్ర వాహనదారుడు నారాయణస్వామిని ములకలచెరువు ఎస్ఐ నరసింహుడు 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం మదనపల్లి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడు ఖాసీం కు భార్య షంషాద్, ఇద్దరు కుమార్తెలు అఫ్రిన్, అమ్మాజాన్ ఒక కుమారుడు ఆసిఫ్ కలరు. ఈయన మృతి తెలుసుకున్న వెంటనే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనవరి 2, 3 కుమార్తె వివాహం పెట్టుకున్నారని అంతలోనే ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయాడని గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కుటుంబ సభ్యులు రోదనలతో అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. దిక్కు లేకుండా చేశావు. ఇక మాకు దిక్కెవరంటూ గుండెలు బాదుకుంటూ రోదించారు. పోస్టుమార్టం కొరకు ఎస్ ఐ నరసింహుడు 108 వాహనంలో మదనపల్లి కు పంపించి కేసు నమోదు చేశారు. గ్రామస్తులంతా అర్ధిస్తూ రెక్కాడితే డొక్కాడని కుటుంబమని కూలినాలి చేసుకుంటూ కొద్దిపాటి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉండటానికి సరైన గూడు కూడా లేదు. ఉన్నదాంట్లో కుమార్తె పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది కుటుంబాన్ని నడిరోడ్డుపై వదిలేశాడు. ఈ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని వీరికి సహకారం అందివ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ఖాసీం అంత్యక్రియలు జరిగాయి.~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News