నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కోరుట్ల పట్టణానికి చెందిన యువకుడు అనారోగ్యంతో మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబాన్ని పోషించాలనే ఆశతో దుబాయ్‌కు వెళ్లిన అబ్దుల్ రహమాన్ (21) చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి మునిగిపోయారు.*ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన యువకుడు*జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మోమిన్‌పురకు చెందిన అబ్దుల్ రహమాన్ పేదరికంతో కుటుంబాన్ని పోషించేందుకు గత సంవత్సరం ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన దుబాయ్‌కు వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్ రహమాన్ అక్కడే చికిత్స పొందుతూ ఈ నెల మార్చి 7న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మంగళవారం దుబాయ్‌లోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిసింది.*ఒంటరైన తల్లి*మృతుడి తల్లి షఫాత్ బేగం తన కుమారుడిపైనే ఆధారపడి జీవనం సాగించేది. కుమారుడు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే ఆమె బోరున విలపించింది. ‘ఇక్కడ పని లేక గల్ఫ్ దేశానికి వెళ్లి నా తల్లిని పోషిస్తాను, ఆమెను బాగా చూసుకుంటాను’ అని చెప్పి వెళ్లిన నా కుమారుడు ఇలా అకాల మరణం చెందడం చాలా బాధగా ఉందని ఆమె కన్నీరుమున్నీరైంది. అబ్దుల్ రహమాన్ లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది.*ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి*ప్రస్తుతం షఫాత్ బేగంకు ఆదుకునే వారు ఎవరూ లేక తీవ్ర దుఃఖంలో ఉంది. ఈ నేపథ్యంలో మృతుడి తల్లికి భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆమె జీవనానికి మార్గం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు._______





