నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి గడించిన ఈ దుబ్బ రాజన్న దేవాలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్న తరుణంలో ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన చర్యలు భక్తులను కలచివేస్తున్నాయి. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంపై భాగంలో కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను తలపించే రంగులు వేయడం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. ఇది యాదృచ్ఛికమా? లేక పాలకుల ప్రభావంతో అధికారులే ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యనా? అనే అనుమానాలు భక్తుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. మహాశివరాత్రి వంటి మహత్తర పర్వదినంలో, లక్షలాది భక్తులు దర్శనానికి తరలివచ్చే వేళ, దేవాలయాన్ని రాజకీయ సంకేతాల వేదికగా మార్చడం భక్తి–రాజకీయాల మధ్య గీతను చెరిపేసే ప్రమాదకర ధోరణిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక సూత్రాన్ని పాలకవర్గం, జిల్లా యంత్రాంగం విస్మరించాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం దేవస్థాన అధికారుల నిర్లక్ష్యాన్ని, అలాగే పాలకవర్గానికి అనుకూలంగా వ్యవహరించే అధికారుల వైఖరిని బట్టబయలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఈ తరహా రంగుల మార్పులు జరిగాయా? లేక అధికారులే కళ్లుమూసుకున్నారా? అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. జిల్లా యంత్రాంగం మౌనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. “దుబ్బ రాజన్న దేవాలయం దేవుడి ఆలయం… ఏ పార్టీ కార్యాలయం కాదు. ఆలయ గోపురంపై పార్టీ రంగులు కనిపించడం మా విశ్వాసాలపై దాడి,” అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని, తక్షణమే రంగులను తొలగించి ఆలయాన్ని సంప్రదాయ శైవ శైలికి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక ఆలయానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. రాష్ట్రంలో పాలకులు మారితే దేవాలయాల రంగులూ మారతాయా? అన్న ప్రమాదకర ప్రశ్నకు ఇది నిదర్శనంగా మారుతోంది. ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే, అధికార యంత్రాంగమే ఈ విధంగా వ్యవహరిస్తే, రేపు మరెన్ని పుణ్యక్షేత్రాలు రాజకీయ రంగుల్లో మునిగిపోతాయో అన్న భయం వ్యక్తమవుతోంది. ఇకనైనా దేవస్థాన అధికారులు, పాలకవర్గం, జిల్లా యంత్రాంగం స్పందించి దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని రాజకీయ రంగుల నుంచి విముక్తం చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి. ఆలయాలు దేవుడి నివాసాలు… రాజకీయాల ఆటస్థలాలు కావు అన్న సత్యాన్ని పాలకులు గుర్తించకపోతే, భక్తుల ఆగ్రహం మరింత తీవ్రమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

