నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 16): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం స్థానిక ఆదర్శ పాఠశాలలో గురువారం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఆహార ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఈరవేణి మాట్లాడుతూ… “6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ఇళ్లలో తయారుచేసిన ఆహార పదార్థాలను ఫుడ్ ఫెస్టివల్ రూపంలో ప్రదర్శించారన్నారు. మక్కగడ్క, జొన్న అంబలి, గారెలు, సత్తు పిండి పదార్థాలు, గుడాలు, రాగి జావ, మిల్లెట్స్ వంటి పౌష్టికాహార వంటకాలు ఆకట్టుకున్నాయి,” అని తెలిపారు. అలాగే విద్యార్థులందరూ ఈ కార్యక్రమం ద్వారా ఆహారపు ప్రాముఖ్యతను, పౌష్టిక విలువలను తెలుసుకోవడంతో చిన్న వయస్సు నుండే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు.




