Thursday, March 19, 2026

*నవంబర్ 25న మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ** వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు—–

*నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 25న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు మూడో విడత వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.*304 కోట్లు విడుదల – మూడో విడతలో 3.57 లక్షల సంఘాలకు ప్రయోజనం*ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండు విడతలుగా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన నేపథ్యంలో, మూడో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 3,57,098 మహిళా సంఘాలకు రూ.304.17 కోట్ల నిధులను ఈ రోజు (నవంబర్ 24) విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రేపు (నవంబర్ 25) నుంచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని, జిల్లా మంత్రులు, శాసనసభ్యులను ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల మహిళా సమాఖ్యలు, గ్రామ స్థాయి సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.*ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల నుంచి అపూర్వ స్పందన*ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పట్ల మహిళల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు. చీరల రంగు, నాణ్యత పట్ల మహిళలు అత్యంత ఆనందం వ్యక్తం చేస్తున్నారని, తక్కువ సమయంలోనే ప్రతి గ్రామానికి చీరలు చేర్చి అర్హులైన మహిళలకు పంపిణీ చేసిన కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి ఎనలేని మద్దతు లభిస్తోందని, మూడో విడత వడ్డీ లేని రుణాలకు రూ.304 కోట్లు మంజూరు చేసినందుకు మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపారు.*సీఎస్ ఆదేశాలు – పకడ్బందీగా అమలు కోసం ప్రత్యేక దృష్టి* ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ, మూడో విడతలో రూ.304 కోట్లకు పైగా నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఈ నిధులను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో పంపిణీ చేయాలని, కార్యక్రమం పకడ్బందీగా జరిగి మహిళలకు వడ్డీ లేని రుణాలు సక్రమంగా అందే సందేశం రాష్ట్రవ్యాప్తంగా వెళ్లేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్న విషయాన్ని మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.*ఇతర సంక్షేమ అంశాలపై కీలక ఆదేశాలు* వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రీ-మెట్రిక్ (9, 10వ తరగతి) మరియు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కూడా చర్చించారు. అర్హులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన 57 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే అర్హులకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా నుంచి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ్ గౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్, జిల్లా పౌర సంబంధాల అధికారి పల్లికొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News