నేటి సాక్షి, ఆసిఫాబాద్: నాలుగేండ్లుగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు లోక్‌అదాలత్ ద్వారా ఏకం అయ్యారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టుల ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించగా, న్యాయమూర్తి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో దంపతులు ఒక్కటిగా సంతోషంగా ఇంటికి వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. జైనూరు గ్రామానికి చెందిన రాథోడ్ వలిత–రాథోడ్ లాహు కుటుంబ సమస్యలతో 2020లో ఆసిఫాబాద్ సఖి కేంద్రాన్ని ఆశ్రయించారు. వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి మార్పు రాలేదు. 2005 గృహ హింస చట్టం కింద కేసు నమోదు కాగా, శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో మళ్లీ ఆ దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో దంపతులు కలిసి ఉండేందుకు రాజీ పడ్డారు. నాలుగేండ్లుగా విడిపోయిన దంపతులు రాజీ పడినందుకు న్యాయమూర్తి అనంతలక్ష్మి, పోలీస్ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపర్ యూనిట్ గులాబ్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బోనగిరి సతీష్‌బాబు, లీగల్ న్యాయవాది అంజలి, న్యాయవాదులు సామిల్ల రమేశ్, ఆకాశ్, నగేశ్, కోర్టు సిబ్బంది రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

