నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో నిర్మించిన మహిళ సంఘ భవనం నిర్లక్ష్యానికి గురైంది. సమాజంలో మహిళల సాధికారతకు ప్రభుత్వాలు అనేక నిధులు కేటాయించి భవనాలు నిర్మిస్తే వాటిని సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రారంభమైన మౌలిక వసతులు లేమి కారణంగా వినియోగంలోకి రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయనే విమర్శలు ప్రజల్లో నుండి వస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఉమ్మడి వెల్లటూర్ మండలంలోనే మొదటి మహిళా సంఘ భవనం చర్లపల్లి గ్రామంలో సుమారు 36 గ్రామైక్య సంఘాలు అందులో 400 మంది సభ్యులు ఉండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ.10 లక్షల నిధులతో నిర్మాణం కాగా అప్పటి ఛీప్ విప్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. తర్వాత మహిళలు సంఘాల పురోగతి, అర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి వంటి అనేక కార్యక్రమాలతో సమావేశాలు మహిళలు నిర్వహించుకుని వారి సాధికారతకు ఐక్యంగా బాటలు వేసుకున్నారు. కొద్ది సంవత్సరాలు ఇదే తరహలో సజావుగా సాగిన.. కరోనా సంభవించడంతో సమావేశాల నిర్వహణ అవకాశం లేకపోవడం, మరోవైపు మౌలిక వసతులు కరెంటు సరఫరా, విధ్యుత్ దీపాలు, నీటి సరఫరా, పర్యవేక్షణ లేకపోవడంతో మహిళలు అటువైపు వెళ్లడం మానేశారు. క్రమేణ ఇదే అదునుగా భావించిన మందు బాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. దీంతో మహిళలు మరింత భయంతో భవనం వైపు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనిని వినియోగంలోకి తీసుకువచ్చేలా పలుమార్లు పత్రికల్లో వార్తలు వస్తున్న, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వెళ్లిన పట్టించుకునే నాథుడే కరువయ్యారని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నూతన గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏర్పడిన క్రమంలో ఇప్పటికైన మహిళ భవనానికి మరమ్మత్తులు చేపట్టి, మౌలిక సదుపాయాలు కరెంట్, నీటి సరఫరా అందేలా చొరవ చూపాలని, స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహాలక్ష్మీల ఆత్మగౌవర ప్రతీకైన మహిళ భవనం వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళలు, గ్రామస్తులు కోరుతున్నారు.

