నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో గత ఎన్నికల తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. అంతే కాదు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మేయర్ సీటు కూడా దూరమైంది. దీంతో ఇక జిల్లాలో వైసీపీ పనైపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో నెల్లూరు నగరంలో వైసీపీకి మళ్లీ ఊపిరివచ్చినట్లయింది. నెల్లూరు సిటీతో పాటు రూరల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు అధికార టీడీపీ కార్పోరేటర్లు గురువారం ఆ పార్టీని వీడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. దీంతో జగన్ కూడా వారిని ఆత్మీయంగా పలకరించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని వారికి సూచించారు. గురువారం వైసీపీలో చేరిన నెల్లూరు టీడీపీ కార్పోరేటర్లలో మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్) ఉన్నారు. వీరంతా టీడీపీపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరితో మాట్లాడి పార్టీలోకి రప్పించారు.~~~~~~~~~~~~~~~~





