నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో నేరాల నివారణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇప్పటికే జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం అందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్‌లో ఆయన పోలీస్ అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న నేరాల స్వరూపం, వాటి పరిష్కార విధానం, పెండింగ్ కేసుల స్థితిగతులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.*పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి*గత నెలలో నమోదైన నేరాలపై సమీక్షించిన ఎస్పీ, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి వాటి సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో, తీవ్రమైన నేరాలు, సాధారణ నేరాలు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి నాణ్యమైన మరియు వేగవంతమైన పోలీస్ సేవలు అందించడం పోలీస్ శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.*భూ వివాదాలు, సైబర్ నేరాలపై చర్యలు*సివిల్ మరియు భూ వివాదాలకు సంబంధించిన కేసుల విషయంలో అనుసరించాల్సిన ప్రమాణిత విధానాలపై (ఎస్ఓపీ) పోలీస్ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలపై నమోదైన పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు నష్టపోయిన డబ్బులు తిరిగి అందేలా బ్యాంకు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాబోయే నేషనల్ లోక్ అదాలత్ (మార్చి 28, 2026) సందర్భంగా పరిష్కరించగల కేసులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.*నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలి*జిల్లాలో ఉన్న వివిధ కేటగిరీల హిస్టరీ షీట్లను సమీక్షించి నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని ఎస్పీ సూచించారు. జిల్లాల మరియు రాష్ట్ర సరిహద్దుల నుంచి జరిగే గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలు చేయాలి*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో పోలీస్ శాఖ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, నేరాలను నియంత్రించడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, రోడ్డు భద్రతా చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.*పండుగలకు భద్రతా ఏర్పాట్లు*ఇటీవల జరిగిన మహాశివరాత్రి, ధర్మపురి బ్రహ్మోత్సవాలు, పెద్దపూర్ జాతర వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని ఎస్పీ అభినందించారు. అదే విధంగా రాబోయే రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా శాంతియుతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.______




