నేటి సాక్షి కొమురం భీమ్ ఆసిఫాబాద్ *శీతాకాలంలో ఉండే పొగ మంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు మరియు ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలి : జిల్లా ఎస్పీ నితిక పంత్* శీతాకాలం తీవ్రంగా ప్రారంభమైన నేపథ్యంలో, తెల్లవారుజామున మరియు రాత్రి సమయంలో పొగమంచు (ఫాగ్) అధికంగా ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ నితిక పంత్ పలు సూచనలు తెలిపారు.పట్టణాలు–గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా ఉదయం వాకింగ్ చేసే వారు రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుందని, పొగమంచు కారణంగా డ్రైవర్లకు ముందున్న వ్యక్తులు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.*పొగమంచు సమయంలో వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు*1. హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు ఎప్పటికప్పుడు ఆన్‌లో ఉంచాలి; ఎక్కువ పొగమంచు ఉన్నప్పుడు లో బీమ్ మాత్రమే వాడాలి.2. వేగాన్ని నియంత్రించాలి; ఓవర్ స్పీడ్ పూర్తిగా నిషేధం.3. ముందున్న వాహనానికి సురక్షిత దూరం తప్పనిసరిగా పాటించాలి.4. రోడ్డుపై ఉన్న వైట్ మార్కింగ్ లైన్స్‌ను దాటి వెళ్లకూడదు.5. అవసరమైనప్పుడు మాత్రమే డిప్పర్–హారన్ వాడాలి.6. వాహనంలోని ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు, వైపర్లు సరిగా పనిచేస్తున్నాయో ముందే చెక్ చేసుకోవాలి.7. ఎదురువారిని బ్లైండ్ చేసే హై బీమ్ వాడకూడదు.8. టైర్లు, బ్రేకులు, వాహనం మొత్తం కండిషన్ ముందుగానే పరిశీలించాలి.9. రోడ్డు పక్కన వాహనాలను అవసరం లేకుండా ఆపరాదు; ఆపాల్సి వస్తే పార్కింగ్ లైట్లు ఆన్ చేయాలి.10. మద్యం సేవించి వాహనాలు నడపరాదు.*రోడ్డుపై వాకింగ్ చేసే ప్రజలకు ప్రత్యేక సూచనలు*1. ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో హైవేలు, ప్రధాన రోడ్లపై వాకింగ్ చేయడం ప్రమాదకరం.2. డ్రైవర్లకు విజిబిలిటీ తగ్గినప్పుడు ముందున్న వ్యక్తులు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.3. వాకింగ్ చేయాల్సిన వారు గ్రౌండ్లు, కాలనీలు, పార్కులు వంటి సురక్షిత ప్రదేశాలను మాత్రమే ఉపయోగించాలి.4. రోడ్డు పక్కన నడవాల్సిన పరిస్థితిలో రెఫ్లెక్టివ్ దుస్తులు లేదా లైట్ కలర్ దుస్తులు ధరించడం మంచిది.5. పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కన వాకింగ్ చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.”పొగమంచు ఎక్కువగా ఉండే ఉదయం 5 నుండి 8 గంటల వరకు, అలాగే రాత్రి 8 తర్వాత అనవసర ప్రయాణాలు చేయరాదని” సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణించవద్దని, కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.“ప్రతి పౌరుడి ప్రాణ భద్రత మా ప్రాముఖ్యత. పొగమంచు సమయంలో తగ్గిన విజిబిలిటీ ప్రమాదాలకు దారి తీస్తుంది. డ్రైవర్లు, వాకింగ్ చేసే వారు సూచనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రాణాలను కాపాడుకోవచ్చు,” అని ఎస్పీ పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 / 112 కు వెంటనే సమాచారం అందించవచ్చని తెలిపారు.





