Monday, January 19, 2026

పత్రికా ప్రకటన, తేది :04-01-2026,పంటల మార్పిడితో అధిక ప్రయోజనాలురైతులు నూతన పద్దతుల్లో వ్యవసాయం చేయాలిమరికల్ లో విస్తృతంగా పర్యటించిన సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ ఐ.ఏ.ఎస్…..

నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 4,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ )రైతులు నూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని, పంటల మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్/ పీఎండీడీ కే వై సెంట్రల్ జోనల్ అధికారి రమణ్ కుమార్ ఐ.ఏ.ఎస్. తెలిపారు. రెండు రోజుల నారాయణపేట జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం జిల్లా కలెక్టరేట్ లో ఇన్ ఛార్జీ కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పీఎండీడీ కే వై కమిటీ సభ్యులతో సమీక్ష చేసిన విషయం విదితమే. రెండో రోజు ఆదివారం సెంట్రల్ జోనల్ అధికారి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మరికల్ మండల కేంద్రాన్ని సందర్శించారు. గ్రామ రైతు శరణప్ప కు చెందిన ఆముదం పంట, టమాట తోటను ఆయన పరిశీలించారు. పంట కోత అయిన తర్వాత గడ్డిని తొలగించేందుకు నిప్పు పెట్టడంతో పొలం నల్లగా మారడం గమనించిన ఆయన పొలాల్లో నిప్పు పెట్టరాదనీ సూచించారు. ఆ ప్రాంత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గత 40 ఏళ్ల క్రితం మన పెద్దలు ఒకే పద్దతి లో వ్యవసాయం చేసేవారని, అప్పట్లో వ్యవసాయ అధికారులు ఉండేవారు కాదని, అప్పుడు ఒకే పద్ధతిలో వ్యవసాయం చేసేవారని ఆయన తెలిపారు. కాలానుగుణంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పర్యటించి పంటల మార్పిడి, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త కొత్త మార్పుల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోందని, అందుకు అనుగుణంగా రైతులు క్రాఫ్ డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో కేవలం తినడానికి సరిపడా పంట పండిస్తే చాలు అనే విధంగా వ్యవసాయం చేసే వారని, కానీ ఇప్పుడు ఉత్పత్తి పెంచేలా చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. మారిన లైఫ్ స్టైల్ తో పాటు మనం మారాలి అన్నారు. ఏటేటా జనాభా పెరుగుతోందని, కానీ భూమి పెరగడం లేదు కదా అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలను వినియోగించుకుని వ్యవసాయ ఉప్పాదకత ను, పశు పాలన, డైరీ ఫామ్ ను పెంచుకోవాలన్నారు. దేశంలోని దాదాపు 700 పైబడి ఉన్న జిల్లాలలో జాతీయ స్థాయిలో సర్వే చేసి వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ అనుబంధ రంగాలలో వెనుక బడిన 100 జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందని, అందులో నారాయణ పేట జిల్లాను కూడా ఎంపిక చేశారని, అన్ని శాఖల సహకారంతో ఉత్పత్తినీ పెంచి క్రెడిట్ సౌలభ్యం కల్పించాలన్నదే పథకం ఉద్దేశం అని ఆయన తెలిపారు. ఇదంతా కేవలం అధికారులు కార్యాలయంలో కూర్చుని చేయలేమని, వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, అందుకే కేంద్రం నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు తాను వచ్చానని సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతిసారి వరి, పత్తి సాగు చేయకుండా ఆముదం, కందులు, కూరగాయలు సాగు చేస్తున్న మరికల్ రైతు శరణప్ప ను ఈ సందర్భంగా నోడల్ అధికారి అభినందించారు. ఒకే రకమైన పంటలు పండించడం ద్వారా నేలల్లో సారవంతం తగ్గుతుందని, పంటల మార్పిడి అవశ్యకత ఉందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలపాలని ఆయన కోరగా పలువురు రైతులు మరికల్ లో వ్యవసాయ మార్కెట్ యార్డు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని, కోయిల్ సాగర్ కాల్వల నీటిని తమ పంట పొలాలకు మళ్లించాలని,పత్తి కొనుగోలులో ప్రాధాన్యత ఇవ్వాలని,ధాన్యం అరబెట్టేందుకు ఫ్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేయాలని నోడల్ అధికారికి విన్నవించారు. స్పందించిన ఆయన సీసీఐ కేంద్ర మేనేజర్ తో అక్కడి నుంచే ఫోన్ లో మాట్లాడి పత్తి కొనుగోళ్లలో జిల్లా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో పత్తి పంట హార్వెస్టింగ్ కోసం కూలీలను నియమించాలని ఓ రైతు కోరగా, అది జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పీ ఎం డీ డీ కే వై బేస్ లైన్ డాటా ప్రస్తుత స్టేటస్ ప్రకారం కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే జిల్లాలో డైరీ ఫామ్ ను, ఫౌల్ట్రీ, గొర్రెల షెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి నీ ఆదేశించారు. జిల్లాకు చెందిన రైతుల మొబైల్ ఫోన్లలో వాతావరణ మార్పులు, వ్యవసాయ పంట ఉత్పత్తుల ధరలను తెలిపే యాప్ లను ఏఈఓలు డౌన్ లోడ్ చేసి ఇవ్వాలని సూచించారు. అనంతరం మరికల్ కు చెందిన దండు నారాయణ రెడ్డి కి చెందిన 28 ఎకరాల పొలంలో సాగు చేసిన వరి, శ్రీ గంధం, ఎర్ర చందనం, మామిడి, నిమ్మ తోట, ఫామ్ ఫౌండ్ ను పరిశీలించారు. మండలానికి ఒక పెద్ద రైతు ఇలా మల్టీ పర్పస్ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని, చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆయన అదేశించారు. ఆ తర్వాత మరికల్ సమీపంలోని కన్మనూరు శివారులో గల గౌరు మోహన్ రెడ్డి కి చెందిన పొలంలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ తోటను సెంట్రల్ నోడల్ అధికారి పరిశీలించారు. జిల్లాలోని నర్వ, మరికల్ మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగు అధికంగా ఉందని హార్టికల్చర్ అధికారి సాయిబాబా తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటల సాగును చూసిన సెంట్రల్ నోడల్ అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మిగతా రైతులు కూడా మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుని వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ( ఎఫ్ ఏ సీ) ఉమా శంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, వికారాబాద్ ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డిఆర్డిఓ మొగులప్ప , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి, నాబార్డు అధికారి షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయకుమార్,డిపివో సుధాకర్ రెడ్డి, తహాసిల్దార్ రామ్ కోటి, గ్రామ సర్పంచ్ గూప చెన్నయ్య, ఉప సర్పంచి ఎండీ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News