నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )వచ్చేనెల మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి (SSC) పరీక్షలను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఎస్ఎస్సీ విధులు నిర్వహించే సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, మండల విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 20 మంది మండల విద్యాధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (సిఎస్ లు), 68 మంది డిపార్ట్మెంటల్ అధికారులు (డిఓ లు), 8 మంది కస్టోడియన్లు, 20 మంది వాహన ఇంచార్జీలు హాజరయ్యారు.*పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలి*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదవ తరగతి పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి చరవాణులు అనుమతించకూడదని, విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడి కార్డు ధరించాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సరిపడా బెంచీలు వంటి మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేసి ప్రశాంత వాతావరణం కల్పించాలని పోలీసు శాఖకు సూచించారు.*ప్రశ్నపత్రాల భద్రత – కట్టుదిట్టమైన చర్యలు*ప్రశ్నపత్రాల రవాణా, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సౌకర్యం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.*నిబంధనల అమలులో నిర్లక్ష్యం చేయొద్దు*జిల్లా పరీక్షల విభాగం డైరెక్టర్ నరేందర్ మాట్లాడుతూ గత సంవత్సరాల నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. టైమ్ టేబుల్ వివరాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు.హాల్ టికెట్ నంబర్, ఓఎంఆర్ షీట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరీక్షల అనంతరం ఓఎంఆర్ షీట్లు, మిగిలిన ప్రశ్నపత్రాల భద్రపరిచే విధానం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆన్సర్ స్క్రిప్ట్స్‌ను మీడియం వారీగా, సబ్జెక్టు వారీగా, సెంటర్ వారీగా వర్గీకరించి బ్రౌన్ పేపర్‌తో సురక్షితంగా ప్యాక్ చేసి అన్ని వివరాలు సరిచూసుకున్న తరువాతే బట్వాడా చేయాలని తెలిపారు. సోషల్ మీడియా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.*ఉత్తమ పాఠశాలలకు ప్రశంసలు*ఎస్ హెచ్ విఆర్ లో జిల్లాస్థాయిలో ఉత్తమ ర్యాంకింగ్ (5 స్టార్ రేటింగ్) సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిఇఓ రాము, జిల్లా పరీక్షల విభాగం అధికారి నరేందర్, జిల్లా కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, సియస్‌లు, డీఓలు, కస్టోడియన్లు, వాహన ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు._______

