*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )రాబోయే 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి పరీక్షల సన్నద్ధతపై బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.*పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి సదుపాయాలు*ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ.. రాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఫర్నిచర్ వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు.*వైద్యం, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి*విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్టీసీ శాఖ పరీక్షా రోజుల్లో సమయానికి బస్సులు నడపాలని, పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి ప్రశాంత వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదాలపై ఫైర్ అండ్ సేఫ్టీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.*పోస్టల్, ట్రెజరీ, ఇతర శాఖల సమన్వయం కీలకం*ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత విషయంలో పోస్టల్ శాఖ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ట్రెజరీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు తమ తమ పరిధిలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, జిల్లా పరీక్షల విభాగం అధికారి నరేందర్, పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆర్టీసీ, ట్రెజరీ, ఫైర్ అండ్ సేఫ్టీ, జిల్లా పంచాయతీ, విద్యుత్, పోస్టల్ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.———

