- పాఠశాల అభివృద్ధి పనులు నాణ్యతతో చేయాలి
- విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్వహించాలి
- సమయం లేదు.. సత్వరమే పూర్తి చేయాలి
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
- అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనుల పరిశీలన
నేటి సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పది కాలాల పాటు మన్నికగా ఉండేలా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు నాణ్యవంతంగా పనులు నిర్వహించాలని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాకతీయకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎంత వ్యయంతో పనులు చేపట్టారు? ఏమేమి పనులు పూర్తి చేశారు? ఇంకా ఏమి పనులు మిగిలి ఉన్నాయి? ఎప్పుడు పూర్తి చేస్తారు? అని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. దీంతోపాటు పనులు నాణ్యవంతంగా ఉండేలా చూసుకోవాలని, సరిగా పనులు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల్లో పాత ఫర్నిచర్, పాత పుస్తకాల లిస్టు తయారు చేయాలని డీఈఓను ఆదేశించారు. వాటిని స్థానికంగానే విక్రయించాలని, వచ్చే డబ్బులతో విద్యార్థులకు మంచి పోషకాహారంతో భోజనం అందించాలని సూచించారు. పనికి వచ్చే ఫర్నిచర్‌ను మాత్రం మరమ్మత్తు చేయించి ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులన్నీ జూన్ 4వ తేదీలోగా పూర్తి కావాలని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంపీ రికార్డులు సైతం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పనుల్లో ఎక్కడ జరగవద్దని, సత్వరమే పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్లు నిత్యం పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. తాగునీటి వసతి విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు టాయిలెట్స్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులన్నింటినీ జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, స్పెషల్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తిమ్మాపూర్ తహసీల్దార్ కనకయ్య, ఈడబ్ల్యూ ఐడీసీ డీఈ నాగేశ్వర చారి, కాకతీయ కాలనీ పాఠశాల హెచ్ఎం షహనాజ్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.