(నేటి సాక్షి )గాజులరామారం పరిధిలోని మహాదేవపురం ప్రాంతంలో ఉన్న పరికి చెరువు ఎఫ్టిఎల్ లో భారీ స్థాయిలో అక్రమ భవన నిర్మాణాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. హెచ్ఎమ్డిఏ లేక్స్ రికార్డుల్లో స్పష్టంగా చెరువు హద్దుల్లోగా ఉన్నప్పటికీ, అధికారుల నిష్క్రియత వల్ల పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.- ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులుచెరువు పరిధిలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు పలు మార్లు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు కేవలం హైడ్రా అధికారులను పంపించి ఒకట్రెండు నోటీసులు జారీ చేయడమే తప్ప, తగిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.“చెరువులు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అయితే, ఇక్కడ మాత్రం చెరువు భూములే నిర్మాణాలకు కేటాయింపవుతున్నాయి. అధికారులు చేతులు దులుపుకుంటే చెరువులు మిగిలేవా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.- చేతులు దులుపుకున్న ఇరిగేషన్ శాఖఈ విషయం మీద ఇరిగేషన్ అధికారులను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా, స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం, ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణం నిషేధితమని, అయినా భవనాలు నిర్మించబడుతుండటాన్ని చూసి కూడా “సమస్యను పరిశీలిస్తాం” అంటూ నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.- పర్యావరణానికి ముప్పుచెరువుల ఎఫ్టిఎల్ను ఆక్రమించడం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వకు అడ్డంకులు ఏర్పడతాయి. దీని ఫలితంగా స్థానిక భూగర్భ జలాలపై ప్రభావం, వరద ముప్పు పెరగడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.- ప్రజల విజ్ఞప్తి: చెరువులు కాపాడండి“ఇకనైనా ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా శాఖలు కదిలి చెరువు ఎఫ్టిఎల్ను కాపాడాలి. చెరువులు కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం అవుతుంది” అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల ఫిర్యాదులకు స్పందించి, అక్రమ నిర్మాణాలను అరికట్టి చెరువును రక్షించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.





