నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్కే అన్వర్ పాషా వారి బృందం పరిగి పట్టణ పరిధిలో నిర్వహించిన ఈ దాడులలో అక్రమ గ్యాస్ సిలిండర్ల నిల్వ, కుళ్ళిన మాంసం విక్రయం నిబంధనలకు విరుద్ధంగా ఐస్‌క్రీమ్‌ల తయారీ చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.మొదటి ఘటనలో, పరిగి విద్యానగర్ కాలనీకి చెందిన కృష్ణ (35) అనే వ్యక్తి తన నివాసంలో అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో 5 నిండుగా ఉన్న సబ్సిడీ సిలిండర్లు, 4 ఖాళీ సిలిండర్లు 3 కమర్షియల్ నిండు సిలిండర్లతో కలిపి మొత్తం 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండో ఘటనలో,పరిగి విద్యానగర్ కాలనీలో నివాసముండే మహ్మద్ ఖలీల్ (34) అనే వ్యక్తి తన మటన్ షాపునకు సంబంధించి సుమారు 35 కిలోల కుళ్ళిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి, దానిని సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు ఆదేశించారు.అదేవిధంగా, పరిగి మెయిన్ రోడ్డులో ఎలాంటి అనుమతులు లేకుండా, గడువు ముగిసిన ముడి సరుకులు మరియు పారిశ్రామిక రంగులు ఉపయోగించి ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న శ్రీ నిత్య ఐస్‌క్రీమ్ యూనిట్‌పై పోలీసులు దాడి చేశారు. దీని నిర్వాహకుడు వికారాబాద్‌కు చెందిన వర్కాల హన్మంతు (45) నుంచి సుమారు కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.మరో ఘటనలో సిద్ధార్థ కాలనీకి చెందిన కె. రమేష్ (42) తన నివాసంలోనే తయారీ తేదీ, గడువు తేదీలు లేకుండా మహా ఐస్‌క్రీమ్ పేరుతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన నిందితులందరినీ తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పరిగి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి,కేసులు నమోదు చేసి నట్లు ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, మాట్లాడుతూ,“ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఎటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. కేవలం లాభాల కోసం కల్తీ ఆహార పదార్థాలు తయారు చేయడం, గడువు ముగిసిన లేదా కుళ్ళిన పదార్థాలను విక్రయించడం చాలా తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి.అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయడం కూడా చట్ట విరుద్ధమే కాకుండా, అగ్ని ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇటువంటి నిర్లక్ష్య చర్యలు సమీప ప్రాంత ప్రజల భద్రతకు కూడా ముప్పుగా మారుతాయి. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.ప్రత్యేకంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు మరింత కఠినంగా నిఘా ఉంచుతున్నారు. హోటళ్లు, మాంసం దుకాణాలు, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం లేదా నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉంచడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం.ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు,” అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.





