* నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)మొంథా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతింది. పలు గ్రామాలు వరద ముంపుకు గురై ఇళ్లు, పంట పొలాలు నీటమునిగిపోయాయి. రోడ్లు, కాలువలు దెబ్బతిన్నాయి. పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కలిసి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు.వరదలతో తీవ్రంగా ప్రభావితమైన పర్చూరు, కారంచేడు, చిన్నగంజాం మండలాల్లో రోడ్లు, పంటలను పరిశీలించిన వారు రైతులకు ప్రజలకు అండగా ఉంటామని ముందుకు సాగారు. గ్రామాల్లో ప్రజల పరిస్థితిని తెలుసుకొని వారికి భరోసా ఇచ్చారు. “ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఎవరూ ఆందోళన చెందకండి” అని మంత్రులు ఎమ్మెల్యే ఏలూరి హామీ ఇచ్చారు. *రైతుల సమస్యలపై స్పందన*పర్యటనలో అన్నంబొట్లపాలెం రైతులు తమ గ్రామానికి కలిసే బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి వెంటనే స్పందిస్తూ, రహదారుల శాఖ అధికారులతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.తిమ్మరాజుపాలెం వద్ద పైపులు నిర్మాణం తక్షణం ప్రారంభించాలని మంత్రి, ఎమ్మెల్యే ఏలూరిలు ఆదేశించారు. అలాగే, పర్చూరు సబ్‌స్టేషన్ వద్ద డ్రైనేజ్ పైపులు ఏర్పాటు చేయాలని రైతుల వినతిని పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. పిడుగురాళ్ల ఓడరేవు హైవేకి సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి ప్రభుత్వం దృష్టి సారించాలని నేతలు కోరారు. గర్నపూడి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి స్థానిక నాయకులు వినతి చేశారు. దీనిపై మంత్రులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు.*అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు – కొత్త ప్రణాళికలు*పిడుగురాళ్ల ఓడరేవు హైవేపై రెండు అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రులు సూచించారు. నాగులపాలెం–కారంచేడు హైవే వద్ద సర్వీస్ రోడ్లలో అవసరమైన చోట బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే, కే.డబ్ల్యూ.డి. యుటీ (KWDT) నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు.*పొగాకు మండెల పరిశీలన*నాగులపాలెం, పర్చూరు ప్రాంతాల్లో పొగాకు మండెలను మంత్రులు కొలుసు పార్థసారథి,గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ల బృందం పరిశీలించింది. రైతులతో చర్చించి, వానల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే మిగిలిన పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.*ప్రజల కష్టాలు నివారించడమే లక్ష్యం*”ప్రభుత్వం ప్రతి రైతు, ప్రతి కుటుంబంతో ఉంది. పర్చూరు వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారాలు తీసుకురావడం మా కర్తవ్యం” అని మంత్రి పార్థసారథి ,ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి, రక్షణ రెండూ సమాంతరంగా కొనసాగిస్తాం” అన్నారు.*ముంపు ప్రాంతాల్లో ప్రత్యక్ష పరిశీలన*మంత్రుల బృందం పర్చూరు, కారంచేడు మండలాల్లో పలు గ్రామాలను సందర్శించింది. పొలాల్లో నిల్వ నీరు, దెబ్బతిన్న కాలువలు, వాగులను పరిశీలించారు. వరద నీటితో పంటలు మట్టిలో కలిసిపోయిన రైతులను పరామర్శించారు. “రైతుల కష్టాలు మాకు తెలుసు… వారు నష్టపోయినంతవరకూ ప్రభుత్వం తోడుంటుంది” అని అన్నారు. అధికారులు తక్షణం నష్టం అంచనాలు పూర్తి చేసి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.*పొగాకు రైతులకు భరోసా*విక్రయానికి సిద్ధంగా ఉంచిన పొగాకు మండేలు నీటిలో తడిసి నష్టపోయినట్లు రైతులు మంత్రులకు వివరించారు. దీనిపై మంత్రి పార్థసారథి స్పందిస్తూ — “పొగాకు రైతులు మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగస్వాములు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. తుఫాను ప్రభావం తగ్గగానే పొగాకు కొనుగోళ్లు త్వరితగతిన పునఃప్రారంభమవుతాయి” అని భరోసా ఇచ్చారు.*ప్రతి రైతుకు న్యాయం – ప్రభుత్వం అండగా*వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతు వెనుక ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. “రైతుల కష్టానికి తగిన పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. పంటలకు న్యాయమైన ధరలు లభించేలా చూస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి సహాయం పొందేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు.*ఎమ్మెల్యే ఏలూరి సమన్వయం – సహాయక చర్యల వేగవంతం*పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్థానిక అధికారులు, నాయకులతో సమన్వయం చేస్తూ రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో నిల్వ నీటిని తొలగించడానికి డ్రైనేజ్ పనులు తక్షణం చేపట్టాలని, పంటల రక్షణ కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలు పంపించాలని ఆదేశించారు.*మౌలిక సదుపాయాల పునరుద్ధరణ*తాగునీరు, రవాణా పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిన చోట తక్షణ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. “ప్రజలు ఇబ్బందులు పడకూడదు… అవసరమైన సౌకర్యాలు కల్పించాలి” అని మంత్రులు పేర్కొన్నారు.





