Thursday, February 26, 2026

*పసిపాప మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి** టిఎంఐవి రాష్ట్ర నాయకులు చుంచు మల్లేశం*

నేటి సాక్షి, ఎండపల్లి:* నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసిపాప మరణించిన ఘటనపై టి.ఎం.ఐ.వి రాష్ట్ర నాయకులు చుంచు మల్లేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులపై తక్షణమే హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రజక సామాజిక వర్గానికి చెందిన చంద్రకళ తన కుటుంబంతో కలిసి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లగా అక్కడి అగ్రవర్ణ కులాలకు చెందిన కొందరు వ్యక్తులు వారిని అడ్డుకొని, దర్శనం టికెట్ పేరుతో గొడవకు దిగడం హేమమైన చర్య అని అన్నారు. అంతేకాకుండా పసి బాలింత అని చూడకుండా తనపై దాడి చేస్తున్న క్రమంలో పుట్టిన రెండు నెలల పసి పాపని చూసైనా కనికరించండి అన్న కనికరం లేకుండా పసి పాపని కింద పడేసి కాలితో తొక్కడం వలన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కేవలం కుల వివక్ష కేసులతో సరిపెట్టకుండా హత్యాకేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన పాప కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సహాయం ప్రకటించాలని, భవిష్యత్తులో ఇలాంటి కుల వివక్ష ఘటనలు జరుగకుండా ఉండేలా ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేయాలని మల్లేశం పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News