సమస్యలపై రిలే దీక్షలు షురూ*
- పాత్రికేయుల మరణాలకు పాలకులదే బాధ్యత
- దీక్షలను ప్రారంభించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
నేటి సాక్షి-మహబూబ్ నగర్:
రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. పాలకుల చిన్న చూపు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జర్నలిస్టుల జీవనప్రమాణాలు అత్యంత దారుణంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యల ను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పాలమూరు లాంటి జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు చేతికిచ్చారే కానీ ఇండ్లు, ఇండ్ల స్థలాలను స్వాధీనపర్చలేదని దుయ్యబట్టారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు తదితర సమస్యలపై టీడబ్ల్యూజఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణతో కూడిన పోరాటం చేస్తుందని మామిడి సోమయ్య ప్రకటించారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహ్మద్ రఫీ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాకిట అశోక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

