నేటి సాక్షి, సైదాపూర్: ఆకునూర్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా భక్తు రాజ్‌కుమార్ చేసిన క్రీడాసేవలు అభినందనీయమని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ అన్నారు. మండలంలోని ఆకునూర్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి కేశవపట్నం ఉన్నత పాఠశాలలో పీడీగా ప్రమోషన్ పొందిన భక్తు రాజ్‌కుమార్‌ను బుధవారం ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామితో కలిసి హన్మండ్ల భాస్కర్ ఘనంగా సన్మానించారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులను వాలీబాల్‌లో రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో రాజ్‌కుమార్ అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. క్రీడలతోపాటు విద్యార్థులకు సాంఘిక శాస్త్రం గణిత శాస్త్రాలను కూడా బోధించి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని అన్నారు. క్రీడలతోపాటు చదువు నేర్పించి విద్యార్థుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఒకప్పుడు ఆకునూరులో వాలీబాల్ ఆట అంటే తెలియని స్థితి నుంచి వాలీబాల్ వేసవికాలం శిక్షణ శిబిరాలను నిర్వహించి విద్యార్థులను రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా ఎదుగుటకు దోహదపడ్డారని అన్నారు. గత సంవత్సరం ఎస్జీఎఫ్ వాలీబాల్ ఉమ్మడి జిల్లాస్థాయి టోర్నమెంట్‌ను మారుమూల ప్రాంతమైన ఆకునూరులో నిర్వహించి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారని అన్నారు. క్రమశిక్షణతో విద్య అయిన క్రీడల్లో అయినా రాణిస్తారని, ఆ దిశగా విద్యార్థుల్లో క్రమశిక్షణ స్ఫూర్తికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాంతకుమార్ సింగ్, బైరి సుధాకర్ గూడూరి రవీందర్ రెడ్డి, గోదారి సమ్మయ్య, హరియ నాయక్, పోగుల విజయ్ కుమార్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.