వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి
నేటి సాక్షి ప్రతినిధి,(బాపట్ల జిల్లా)జూలై07
బాపట్ల జిల్లాలో పి.ఎం.సూర్య ఘర్ పధము క్రింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం గా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకాన్ని పూర్తిస్థాయిలో ఆమలు చేయడానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని ఆయన చెప్పారు. పీఎం సూర్య ఘర్ కార్యక్రమం రిజిస్ట్రేషన్లు ముందంజలో ఉన్న జె. పంగులూరు మరియు నగరం మండల పరిషత్ అభివృద్ధి అధికారులను జిల్లా కలెక్టర్ అభి నందించారు. సంతమాగులూరు, మార్టూరు, కొరిశపాడు, కొల్లూరు, బాపట్ల, వేమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సూర్యఘర్ రిజిస్ట్రేషన్లు చేయడం లో నిర్లక్ష్యంగా ఉన్నారని పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు డి.ఆర్.డి.ఏ ఏ.పి.ఎంలు గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం పై విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాలో పి4 కార్యక్రమం బాగా ఆమలు జరిగిందని ఈ విషయంపై ముఖ్యమంత్రి నుండి అభినందనలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, డి.ఆర్.డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు, జిల్లారవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శివ పార్వతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి ,బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి. గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.