నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చి మహిళ మృతి చెందిన ఘటన విచారకరమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్సకని వచ్చిన మహిళ వైద్యం అందక వరండాలో పండుకొని చలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఘటన మానవీయతకు మాయని మచ్చగా మిగిలిపోతుందని నిస్సార్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుచరులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. శనివారం సాయంత్రం అవెన్యూ రోడ్డు లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిస్సార్ అహ్మద్ విలేఖరులతో మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం బలకవారిపల్లికి చెందిన మల్లమ్మ శుక్రవారం ఆసుపత్రికి చికిత్స కోసమని రావడం జరిగిందని ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమెను ఆస్పత్రి లోపల పడుకోబెట్టకుండా ఆసుపత్రి వరండాలో పడుకోమని చెప్పడంతో విధిలేక ఆస్పత్రి వరండాలో విశ్రాంతి తీసుకుంది. చలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం అందక మృతి చెందిన ఘటనపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నిస్సార్ అహ్మద్ డిమాండ్ చేశారు. భాదిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేయాలని, భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా వుంటే పీపీపీ విధానం వస్తే ఎలా వుంటుందో ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు తీసుకొని వస్తే వాటిని ప్రభుత్వం నిర్వహించకుండా పీపీపీ విధానంలో అమలు చేస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహిస్తే జగన్ మోహన్ రెడ్డి కి పేరు వస్తుందనే సిఎం చంద్రబాబునాయుడు పీపీపీ విధానంలో అమలు చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించే హాస్పిటల్లో ఇలా వుంటే, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు వస్తే ఇంకా దుర్భరమైన ఘటనలు చోటు చేసుకుంటాయని నిస్సార్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు..~~~~~~~~~~~~~~~~~~

