నేటిసాక్షి, కరీంనగర్: 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ, పల్స్ పోలియో బిల్లులను చెల్లించాలని శనివారం కరీంనగర్ కలెక్టరేటు ఎదుట సీఐటీయూ ఆశా వర్కర్లు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ ఈ బిల్లులపై డీఎంహెచ్‌ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఆశా వర్కర్లకు 18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేవరకు పోరాడుతామన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేయాలని ఆశా వర్కర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఏఎన్సీ, పీఎన్సీ లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఎన్సీడీ సర్వేలు కూడా చేయాలనడం సరికాదని, పనిభారం పెంచినట్లు జీతాలను పెంచాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి మారెల్ల శ్రీలత, అధ్యక్షురాలు కాల్వ సారిక, పద్మ, లత, శ్యామల, సుమ, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

