నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య. )జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో పెద్దవాగు ప్రవహించే మండలాల్లోని సాండ్ రీచులపై సంబంధిత శాఖల అధికారులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు. కథలాపూర్ మండలంలోని సిరికొండ, తక్కలపల్లి, మెట్ పల్లి మండలంలోని ఆత్మకూర్, కోరుట్ల మండలంలోని పైడిమడుగు, మల్లాపూర్ మండలంలోని సాతారం, వి.వి.రావుపేట, రాయికల్ మండలంలోని ఇటిక్యాల, జగన్నాధపూర్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాల అనుమతిపై పరిశీలన చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏడి మైన్స్ జగిత్యాల, గ్రౌండ్ వాటర్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.*వాల్టా చట్టం ప్రకారం త్రవ్వకాలకు అవకాశం లేదు*పరిశీలన అనంతరం గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులు వాల్టా చట్టం ప్రకారం ఆయా సాండ్ రీచులలో ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. భూగర్భ జలాల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత దృష్ట్యా స్థానికంగా ఇసుక త్రవ్వకాలు అనుమతించరాదని వెల్లడించారు. అందువల్ల నిర్మాణ అవసరాల కోసం ప్రజలు జగిత్యాల పట్టణంలోని అధికారిక సాండ్ బజార్ నుంచే ఇసుకను కొనుగోలు చేయాలని సూచించారు.*ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక రేట్లు*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుకను ప్రత్యేక రాయితీ ధరకు అందుబాటులో ఉంచారు. ఒక మెట్రిక్ టన్ను ఇసుక ధరను రూ. 900గా నిర్ణయించారు. నాలుగు మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న ఒక ట్రాక్టర్‌కు రూ. 3600 కాగా, సర్వీస్ చార్జీలు రూ. 346 కలిపి మొత్తం రూ. 3946 (రవాణా చార్జీలు కాకుండా) చెల్లించాలి. ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గరిష్టంగా 8 ట్రాక్టర్లు, అంటే 32 మెట్రిక్ టన్నుల ఇసుకను అందించనున్నారు.ఇందుకోసం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రం, ఆధార్ కార్డు, గ్రామపంచాయతీ కార్యదర్శి జారీ చేసే ఇసుక కూపన్ సమర్పించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.*సాధారణ నిర్మాణాలకు వేరు ధర*ఇందిరమ్మ ఇండ్లకు కాకుండా సాధారణ కట్టడాల నిర్మాణం కోసం ఇసుక రేటును ఒక మెట్రిక్ టన్నుకు రూ. 1300గా నిర్ణయించారు. నాలుగు మెట్రిక్ టన్నుల ట్రాక్టర్‌కు రూ. 5200 కాగా, సర్వీస్ చార్జీలు రూ. 426 కలిపి మొత్తం రూ. 5626 (రవాణా చార్జీలు కాకుండా) చెల్లించాలి.*ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం*ప్రజలు ఇసుకను తెలంగాణ ప్రభుత్వ అధికారిక సాండ్ పోర్టల్ https://sand.telangana.gov.in/tgsandportal/masters/home ద్వారా లేదా చరవాణి సౌకర్యంతో బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.జగిత్యాల సాండ్ బజార్ చిరునామా ధర్మశాల, వాణి నగర్, జగిత్యాల వద్ద ఉందని వెల్లడించారు.అక్రమ త్రవ్వకాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ అనుమతితోనే, అధికారిక మార్గాల్లో ఇసుక కొనుగోలు చేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.——-

