నేటిసాక్షి, కరీంనగర్:కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలను డీసీసీ కార్యాలయంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు నివాళులుర్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం వెంకటస్వామి చివరి శ్వాస వరకు పరితపించారని, ఆ కాలంలోనే నిలువ నీడలేని పేదలకు ఇండ్లను ఏర్పాటుచేసిన ఆయన గొప్ప సోషల రిఫార్మర్ అన్నారు. దీంతోనే ఆయనకు గుడిసెల వెంకటస్వామి, కాకా అనే ముద్దుపేర్లు వచ్చాయని, ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారంటే ప్రజల్లో ఆయనకు ఎంత పట్టు ఉందో తెలుస్తోందన్నారు. జాతీయ స్థాయిలోనూ ప్రభావిత నాయకుడిగా వెలుగొదారని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో సాన్నిహిత్యం ఉండేదని గుర్తుచేశారు. 1969 తెలంగాణ పోరాటంలో కీలక వ్యక్తిగా పోరాడారని, నేటితరం నాయకులు, కార్యకర్తలు ‘కాకా’ ఆదర్శంగా తీసుకొని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.





