- కోరుట్ల మున్సిపాలిటీలో ‘ఆడింది ఆట-పాడింది పాట’
- అక్రమ నిర్మాణాలకు అధికారులే అండా
- అడిగేది ఇంటి నిర్మాణం పేరిట-కట్టేది కమర్షియల్ కట్టడం
- పాలకులు – ప్లానింగ్ అధికారుల ‘డీల్’
- అక్రమ నిర్మాణాలపై మౌనమే ఇందుకు సాక్ష్యం
- అక్రమ అంతస్తులపై సమాచారం అడిగితే అధికారుల అహంకార సమాధానం
నేటి సాక్షి, కోరుట్ల: ‘నేను గిచ్చినట్టు చేస్తా.. నువ్ నొచ్చినట్టు ఏడువు’.. ఆ తర్వాత మనం-మనం బరంపురం అని చాటుమాటుకు పంచుకుతిందామని ‘కోరుట్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో’ పాలకులు.. అధికారులు.. అక్రమ నిర్మాణాల యాజమాన్యాలు మూకుమ్మడిగా కమ్మక్కైనట్టు ప్రజలు అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారు. కోరుట్ల మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో ‘కొందరు’ స్థానిక ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే.. అక్రమ భవన నిర్మాణాల్లో ‘కరెన్సీ కట్ట’లను వాటాలేసుకుంటూ పంచుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
– అంతస్తు పెరిగితే చాలు గద్దల్లా వాలిపోతారంట
కోరుట్ల మున్సిపల్ పరిధిలో ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలు, పెద్ద ఎత్తున షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాలు సక్రమమా.?అక్రమమాని ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన ప్రజాప్రతినిధులే దగ్గరుండి అక్రమ నిర్మాణాలకు, షెడ్లకు ‘అండా దండై’ నిలుస్తున్నారన్న విమర్శలున్నాయి. కోరుట్లలో జరిగే అక్రమ నిర్మాణాలపై ప్రజలు ఫిర్యాదు చేయడమంటూ అసలు ఉండనే ఉండదు.. స్థానిక నేతలే తమ అనుచరులతో అధికారులకు సమాచారం చేరవేసి ఆ నిర్మాణం సంగతేంటో చూడుమని ‘బాధ్యతగల నేతలే’ ఆర్డర్లు వేసి ‘అక్రమార్కులతో-డీల్’ కుదిరేలా సెట్ చేస్తారన్న విమర్శలు కోకొల్లలు.
– ప్రభుత్వ ఆదాయానికి గండి
సక్రమ నిర్మాణాలు చేసిన భవన నిర్మాణ యజమానుల నుంచి ప్రభుత్వానికి లక్షల కొద్దీ ఆదాయం చేకూరుతుంది. అయితే నిబంధనల ప్రకారం వచ్చే ఆదాయం జమవుతున్నా పరిమితికి మించి కట్టే అంతస్తుల ద్వారా వచ్చే ఆదాయం పాలకులు-ప్లానింగ్ అధికారుల జేబుల్లోకి వెళుతోందనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. ఇదంతా అటు జిల్లా అధికారులు కానీ, ఇటు మండల అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదని అమాయక పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తుంటారు. ఎవరైనా జనాలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం, నోటీసులు జారీ చేస్తాం అనే సమాధానాలు అధికారుల వైపు నుంచి వినిపిస్తుంటాయే తప్పా.. అధికారుల చర్యలు తీసుకోవడమనేది ఉండదని డబ్బులు ఇవ్వని ప్రజలు వాపోతున్నారు. అధికారుల పనితీరు దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా ఉందని పట్టణ వాసులు వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్న అధికారులు ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాదారులు ఇచ్చే సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు స్థానిక అధికారులపై చర్యలు తీసుకోకపోతే కోరుట్లలో మరింత అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరిగి ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
– అనుమతులు ఇంటి నిర్మాణం..కట్టేది కమర్షియల్ కట్టడం
కోరుట్ల మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల తంతు యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులేమో గృహ నిర్మాణం కోసం తీసుకుని నిర్మాణాలు మాత్రం వారికి నచ్చిన విధంగా (కమర్షియల్) నిర్మిస్తున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు తోడుకావడంతో పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. గృహ నిర్మాణం కోసం అనుమతులు తీసుకుంటూ వ్యాపార సముదాయాలను నిర్మిస్తున్నా.. ఉన్నతాధికారులు వీటిపై దృష్టిపెట్టకపోవడంతో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహారం జరుగుతోంది. టీఎస్‌బీపాస్‌ద్వారా ఏ నిర్మాణం చేపట్టాలన్నా దరఖాస్తులు చేసుకుంటే అధికారులు పర్యవేక్షణ చేసి అనుమతులు ఇస్తారు. కానీ దరఖాస్తు ఏమో గృహ నిర్మాణం కోసం, నిర్మాణం ఏమో వాణిజ్య అవసరాల కోసం చేస్తున్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్ బృందాలు మాత్రం ఏమిపట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
– అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులు..??
కోరుట్ల పట్టణంలో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోయారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమ కట్టడాలకు చర్యలు ఎక్కడ అని స్థానికులు నిలదీస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు నిబంధనలను గాలికి వదిలేసి కొంతమంది బడా నాయకుల అండదండలు ఉండడంతో పనులు కాని చేస్తున్నారు. దీనితో మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి పడుతుంది. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాలలో అధికారులు చెప్పినా వారిలో కదలిక కనిపించడం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకులోనై మామూళ్లకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.. తమ విధులను సక్రమంగా ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని. అధికారులకు ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోకపోగా అటువైపు కన్నెత్తి చూడటం కూడా లేదని స్థానికులు చెబుతున్నారు.
– అక్రమ నిర్మాణాలపై సమాచారం అడిగితే అధికారుల అహంకార సమాధానం
కోరుట్ల మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ‘విలేకరులు’ కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను సమాచారం అడిగితే అహంకార పూరితంగా సమాధానమిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలపై సమాచారం కావాలని ఫోటోలు చూపించి అడిగితే మీకు సమాచారం ఇచ్చే ఉద్ధేశం మాకు లేదు.. మీకు కోరుకున్న సమాచారం కావాలంటే ‘సమాచార హక్కు చట్టం’ కింద దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది.
‘స్టే’..తెచ్చుకోమని సలహాలు కూడా ఇస్తరంట
అనుమతులు లభించిన దాని ప్రకారం నిర్మించుకున్నా కూడా ‘ముట్టజెప్పాల్సిన-ముడుపులు’ ముట్టజెప్పాల్సిందేనటన్న విమర్శలూ ఉన్నాయి. ఒకవేళ అనుమతికి మించి అదనపు నిర్మాణం చేపడితే ‘అదనపు’ సొమ్ముకు ‘చీకటి ఒప్పందం’ తప్పదంటున్నారు. ఎవరైనా వివరాలడిగితే.. వివరాలు ఇచ్చే లోపు ‘అక్రమ నిర్మాణం’ పూర్తయి.. ‘గృహప్రవేశమే’ ఐపోతుంది.. మళ్లీ ఎవరైనా ఫిర్యాదు లాంటిది చేస్తే కోర్టు నుంచి ‘స్టే’ తెచ్చుకోమని వీళ్లే అక్రమార్కులకు ‘సలహాలు-సూచనలు’ కూడా ఇస్తారంట. అసలు ఇంటి నిర్మాణాలు తీసుకుంటున్న సమయంలోనే దరఖాస్తు చేసుకున్న ఇంటి యజమాని వద్దకు వెళ్లి అన్ని పరిశీలన జరిపి అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు కేవలం అమ్యామ్యాలకు అలవాటు పడి నిర్మాణం జరిగే ప్రదేశాన్ని చూడకుండానే అనుమతిలిస్తున్నారని, ఈ సమయంలో భారీ మొత్తంలో చేతులు మారుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు కారకులెవరో గుర్తించి వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
– నోటీసులు ఇచ్చేది ‘డీల్’ చేసుకోమనంట
మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలే పరమావధిగా ఇటు కౌన్సిలర్లు అటు అధికారులు డ్యూటీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ లో స్థానికులు ఫిర్యాదులు చేసిన పత్రికల్లో కథనాలు వచ్చిన స్పందించే తీరిక లేదు అధికారులకు, ఎందుకంటే ముందుగానే అక్రమ నిర్మాణదారుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్నారని, ప్రజాప్రతినిధులు కూడా అక్రమ నిర్మాణదారులతో కావలసింది తీసుకుని అన్ని నేను చూసుకుంటాను, మీరు చింతించకండి అని చెప్పి అక్రమ నిర్మాణం వద్దకు అధికారులు, సిబ్బంది వెళ్లిన అక్కడికి వెళ్ళవద్దు అని ఆజ్ఞలు జారీ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కోరుట్ల మున్సిపల్ పరిధిలోని టీచర్స్ క్లబ్ రోడ్డులో స్టిల్ట్ ఫర్ పార్కింగ్ ప్లస్ 3 అప్పర్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని పర్మిషన్ కి విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణం పై లోతుగా విచారించగా స్టిల్ట్ ఫర్ పార్కింగ్ అనుమతి తీసుకుని, అనుమతికి విరుద్ధంగా నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులు టీచర్స్ క్లబ్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ప్రతిరోజు కూరగాయలు అమ్మేవారు, వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డులో ఒక నూతన కమర్షియల్ నిర్మాణం నిర్మించారు.
ఈ నిర్మాణం పై మున్సిపల్ అధికారులను అడుగగా అధికారులు ఈ నిర్మాణం కు నోటీసులు జారీ చేశామని నామ మాత్రంగా సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.కానీ..ఈ నిర్మాణం స్టిల్ట్ ఫర్ పార్కింగ్ ప్లస్ 3 అప్పర్ ఫ్లోర్ గా ‘రెసిడెన్షియల్ భవన నిర్మాణ అనుమతి పొంది కమర్షియల్ షాప్స్ నిర్మించారన్న విమర్శలు ఉన్నాయి’.
నిబంధనాల ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా పార్కింగ్ కు మాత్రమే అనుమతి కలదు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు. కానీ అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు కేవలం నోటీసులు మాత్రమే జారీ చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని భవన యజమానులు ఇష్టారీతిన ఎలాంటి ‘సెట్ బ్యాక్’ లేకుండా నిర్మాణాలు సాగిస్తున్నారు. ఈ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఫస్ట్ నోటిస్ ఇచ్చి భవన నిర్మాణ యజమానితో సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం.
ఇలాంటి నిర్మాణాలు కోరుట్ల పట్టణంలో ఏ రోడ్డుకు వెళ్లినా ‘తలపాగా’ కిందపడేంత ఎత్తున్న నిర్మాణాలు చాలానే ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ఫంక్షన్ హాల్లు.. కమర్షియల్ నిర్మాణాలు.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు..ఇండిపెండెంట్ భవనాలు కోకొల్లలుగా నిర్మితమవుతున్నాయి.మరి ఇంత సక్రమ మార్గంలో నిర్మాణాలు జరిగితే..రోడ్లమీద బైకులు..కార్లు..ఎందుకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే సమాధానం చెప్పేవారుండరు.అన్నింటికి సక్రమ అనుమతులు ఉన్నాయని దాటవేస్తున్నారు.
జాడా-పత్తాలేని పర్యవేక్షణ కమిటీ.?
అక్రమ అంతస్తుల భవనాల నిర్మాణాలపై ‘ఆర్డీఓ-సిఐ-మున్సిపల్ కమీషనర్’లతో కూడిన పర్యవేక్షణ కమిటీ ఏం చర్యలు చేపట్టిందన్న ప్రశ్నలూ ఉండవు.. ఒకవేళ ఎవరైనా ‘ప్రెస్సోల్లు’ అడిగితే సమాధానాలు ఉండవు.కాదూ కూడదని పేపర్లో వార్తలు రాస్తే.. రాసినవారు ‘లంచాల కోసం – బెదిరించారని’ ఆరోపిస్తూ ‘జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు.. పత్రికా యాజమాన్యాలకు ఫోన్లు..రాసినోడికి లీగల్ నోటీసుల పేరిట భయపెట్టడం’ వంటివి జరుగుతాయి.ఎనచని పేపర్లలో ఎన్ని వార్తలు రాసినా ‘దున్నపోతు మీద వాన చినుకులు’ పడ్డ మాదిరిగానే ఉంటుంది తప్ప ఆఫీస్ నుండి అడుగు కూడా కదపరన్నది ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.!
ఇకనైనా అనుమతికి విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టకుండా చూడవలసిందిగా రోడ్డును ఆక్రమించి జరిగే నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

