నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)పోరాటాల ద్వారానే అన్నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు స్పష్టం చేశారు . మంగళవారం మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిపిఐ పార్టీ సభ్యుల రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు పి. మహేంద్ర అధ్యక్షతన బైరాగి పట్టెడ లోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ శిక్షణా తరగతులకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక, కష్టజీవుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఆవశ్యమని అన్నారు. కార్మికుల పనిగంటలు తగ్గింపు కోసం అనేక పోరాటాలు చేయడానికి కారల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక ఉపయోగ పడిందన్నారు 1925 డిసెంబర్ 26వ తేదీన కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్ లో ఆవిర్భవించిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ఎజెండా బ్రిటీష్ పాలకులు భారత దేశాన్ని వదిలి పోవాలని, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నినాద మిచ్చి పోరాడిందన్నారు . దేశం లో అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి అధికారం లేకపోతే కనుమరుగవుతున్నాయి అన్నారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కేవలం అధికారం కోసం పుట్టినవే… ప్రజల కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అన్నారు.సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం, కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు కోసం కార్మిక సంఘాల ను ఐక్య పరచి పోరాడేది సిపిఐ అని స్పష్టం చేశారు. ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కె వి రమణ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రతి పార్టీ సభ్యులు సైద్ధాంతికంగా రాజకీయంగా ఎదగాలని అందుకు అవసరమైన చైతన్యం కలిగి ఉండాలని, అలాంటి చైతన్యం కావాలంటే మార్క్సిజం ను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ శిక్షణా తరగతులు ప్రారంభానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పార్టీ ఉద్యమ గీతాలను ఆలపించారు. ఈ శిక్షణా తరగతులు లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, జె విశ్వనాథ్, శాఖ కార్యదర్శిలు పి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.





