నేటి సాక్షి గజ్వేల్, ఫిబ్రవరి 17: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలో సేవా స్పూర్తితో కూడిన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని అభిమానులు సేవా దినంగా మార్చి, పలు సామాజిక కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉదయం ప్రార్థనలతో ప్రారంభమయ్యాయి. నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తిపూర్వకంగా ప్రార్థించారు. అనంతరం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి ను సందర్శించి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కూడా జన్మదిన వేడుకలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ సేవలను స్మరించుకున్నారు.గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద కుటుంబాన్ని పరామర్శించి రూ.72 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం అందించిన ఈ సాయం కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట కలిగించింది. ప్రజా సేవే కేసీఆర్ సిద్ధాంతమని, ఆ స్ఫూర్తితోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నాయకులు పేర్కొన్నారు.అనంతరం ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వందలాది మందికి భోజనం అందించి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చారిత్రాత్మకమని, ఉద్యమ నాయకుడిగా ప్రజల్లో నమ్మకం నింపిన ఆయన, పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపారని కొనియాడారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన చూపిన దూరదృష్టి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజా సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మహిళా నాయకులు, యువజన కార్యకర్తలు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

