అరాచక శక్తుల ఆగడాలను అడ్డుకుంటే పోలీసులపై అవినీతి ముద్ర వేస్తారా.?
- వై. గోపిరెడ్డి,
రాష్ట్ర అధ్యక్షులు,
తెలంగాణ పోలీసు అధికారుల సంఘం
నేటి సాక్షి – జగిత్యాల
( రాధారపు నర్సయ్య )
జగిత్యాల జిల్లా.. రాజారాం పల్లిలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ పోలీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపి రెడ్డి అన్నారు.
“లంచం తీసుకోకుంటే పోలీసులకు నడవదు అని, పోలీసులేమీ శుద్ధపూసలు కాదని.. తెల్లారి లేస్తే బల్లకింద చెయ్యి పెట్టకుండా వారికి నడవదని..మనం వాళ్లకు భయపడాల్నా.. వాళ్ళు మనకు భయ పడాల్నా తేల్తది అని.. సమాజంలో జరుగుతున్న దందాలపై మా నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీసూ విధుల్లో ఉండరు..”అని బెదిరింపు ధోరణిలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గోపిరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ పోలీస్ అంకితభావంతో పనిచేస్తుంది
దందాలను అరికట్టడంలో.. అవినీతిని కట్టడిచేయడంలో.. శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసు అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. ఆ క్రమంలో ఎందరో పోలీసులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని గుర్తుచేశారు. తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేశారని.. ప్రజలకు అండగా నిలబడడంలో పోలీసు వ్యవస్థ ఎన్నడూ వెనకడుగు వేయదని చెప్పారు.అదే సమయంలో ఎవరి బెదిరింపులకూ పోలీసు వ్యవస్థ భయపడదని గుర్తుంచుకోవాలన్నారు.
మీ ప్రభుత్వంలో పనిచేసిన పొలీసులమే కదా!
భారత దేశంలోనే అత్యంత సమర్థులైన పోలీసులు అని మీరే చెప్పారు కదా.! మీ అధికారం పోగానే పోలీసులను అవినీతి పరులుగా ముద్రలు వేయడం సబబేనా? అని గోపిరెడ్డి ప్రశ్నించారు.ఈ వ్యాఖ్యలు మీ రెండు నాల్కల ధోరణిని బయటపెడుతున్నాయని స్పష్టం చేశారు. మొత్తం పోలీసులను తప్పు పడుతున్న మీ ప్రజాస్వామిక ఆలోచనలను అనుమానించాల్సి వస్తుందని.. పోలీసులపై, వారి కుటుంబ సంభ్యులపై మీరు వేసిన ముద్ర అమానవీయమైనదని పేర్కొన్నారు.
డౌటుంటే.. కంప్లైంట్ చేయండి
అవినీతి పరులు ఎవరైనా ఉంటే మీరు నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అంతేగానీ… మీ అవకాశవాద రాజకీయాలకు పోలీసులను బాధ్యులను చేయవద్దని, మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గోపిరెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.!





