నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా పోలీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ అధికారులు, సిబ్బంది, హోం గార్డ్స్ అధికారుల వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన “మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని” జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు , జిల్లా ఏ ఆర్ విభాగం హోం గార్డులకు వారి కుటుంబ సభ్యులకు భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో నిరంతరం మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే పోలీసుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, వారిలో ధైర్యాన్ని, దృఢత్వాన్ని నింపడమే ఈ మెగా శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం సిబ్బందికి ఈసిాజి, రక్తపోటు (బీపీ), షుగర్ లెవల్స్, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) హృదయ స్పందన రేటు వంటి ప్రాథమిక పరీక్షలతో పాటు.. జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ (స్త్రీ రోగ నిపుణులు), ఆర్థోపెడిక్ (కీళ్ల వ్యాధి నిపుణులు), కార్డియాలజిస్ట్ (గుండె సంబంధిత నిపుణులు), డెంటల్ కంటి పరీక్షలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించారు. కేవలం సిబ్బందికే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడమే కాక, తదుపరి చికిత్స కోసం తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సూక్తి పోలీస్ వృత్తిలో ఉన్నవారికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజ రక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదని, పోలీస్ సిబ్బంది శారీరకంగా, మానసికంగ దృఢంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించడం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పని ఒత్తిడి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తగినంత విశ్రాంతికి సమయం కేటాయించాలని తెలిపినారు. కేవలం జబ్బు పడినప్పుడు మాత్రమే కాకుండా, ఇలాంటి ముందస్తు వైద్య పరీక్షల ద్వారా భవిష్యత్తులో రాబోయే తీవ్ర అనారోగ్య సమస్యలను ఆదిలోనే అరికట్టవచ్చని ఆమె సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి స్వర్ణ కుమారి , డిఆర్‌సిబి డీఎస్పీ జానయ్య, డిటిసి డిఎస్‌పి శ్రీనివాసులు, వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, ఏఆర్ డిఎస్‌పి వీరేష్, ఏఓ ఖజామోహినోద్దీన్ పాల్గొన్నారు. అలాగే ప్రముఖ వైద్యులు సత్యనారాయణ, రాజశేఖర్ రెడ్డి, జగదీష్, చంద్రకాంత్, చిరంజీవి తమ వైద్య సేవలను అందించారు. ఇట్టి కార్యక్రమం లో ప్రభుత్వ హాస్పిటల్,కంటినెంటల్, డాక్టర్. ఐ అగరర్వాల్, మాక్స్ విషన్, శ్రీ సాయి డెంటల్ ల డాక్టర్ లు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ గారు, పలువురు సిఐ లు, ఆర్‌ఐ లు, ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. తమ సంక్షేమం కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు పోలీస్ సిబ్బంది ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

