నేటి సాక్షి గజ్వేల్ : ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా సోమవారం 5కే రన్ నిర్వహించగా, పార్కుల్లో సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టారు.మున్సిపల్ చైర్పర్సన్ జి. చందన ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం కలిగిస్తాయని తెలిపారు. యువతతో పాటు మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ రన్లో పాల్గొన్నారు.అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట్ గోపాల్ ఆధ్వర్యంలో రాజీవ్ పార్క్ మరియు హెర్బల్ పార్క్ లలో సేంద్రియ ఎరువుల తయారీ కోసం కంపోస్ట్ గుంతలను ప్రారంభించారు. పార్కుల లో పడే ఆకులు, గడ్డి మరియు ఇతర సహజ వ్యర్థాలను చెత్తగా పారవేయకుండా వాటిని శాస్త్రీయ విధానంలో కుళ్ళింపజేసి సేంద్రియ ఎరువుగా తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.తయారయ్యే ఈ సేంద్రియ ఎరువును తిరిగి పార్కుల్లోని మొక్కలకు వినియోగించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభించడంతో పాటు మున్సిపాలిటీ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. పార్కుల పరిశుభ్రతను కాపాడటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ బొగ్గుల స్వప్న, 13వ వార్డు కౌన్సిలర్ మార్కంటి భాగ్యలక్ష్మి, 3వ వార్డు కౌన్సిలర్ కాముని మురళి, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మెప్మా ఆర్పీలు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





