నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 22~అన్నమయ్య జిల్లా :-: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం మదనపల్లి పట్టణంలో వేకువజామున పోలీసులు శాఖ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో డక్నీ పేట, అగర్తలా వీధి, ఘోసియా వీధి, త్యాగరాయ వీధి, సైదాపేట, పెద్ద మసీదు వీధి లలో, బాడేమకాన్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 1వ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ, 2వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని, అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి విచారణ చేపట్టారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించామని, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు కలిగి ఉండాలని, అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల నివారణ అందరి బాధ్యత అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఎవరైనా పట్టుబడితే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రవాణా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ~~~~~~~~~~~~~~~~~~





