నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి అర్జీపై సమగ్ర విచారణ జరిపి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు.*సమగ్ర విచారణ – తక్షణ చర్యలు*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే వేదిక అని తెలిపారు. శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై అధికారులు సానుకూలంగా స్పందించి, సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 36 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అప్పగించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పెల్లి ఆర్డీఓలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజావాణి వేదిక కీలకంగా మారాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.____





