నేటి సాక్షి నంద్యాల, డిసెంబరు, 08 :-**ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీ ప్రజల నమ్మకానికి నిదర్శనమని. అందుచేత వాటిని అత్యంత ప్రాధాన్యంతో, నాణ్యతతో, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం అధికారులు తమ బాధ్యతగా భావించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన కలెక్టర్, రీఓపెన్ అయిన 592 దరఖాస్తులను ఒక వారం రోజుల్లో పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా SLAలో ఉన్న 1,797 దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్ అర్జీల ఆడిట్‌ను నిరంతర ప్రక్రియగా తీసుకోవాలని, ప్రతి దరఖాస్తు ప్రగతి దశను అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఆలస్యానికి తావు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి విజ్ఞప్తిని సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజా నమ్మకాన్ని మరింత బలపరచాలని కలెక్టర్ తెలిపారు. *●పాణ్యం మండలం సుగాలిమెట్టకు చెందిన కత్రవత్ శేషిబాయి తమ పూర్వీకుల నుండి సాగు చేస్తున్న సర్వే నెం.430లోని రెండు ఎకరాల భూమిని ఆన్లైన్‌లో నమోదు చేసి, అడంగల్ మరియు పాస్‌బుక్ జారీ చేయవలెనని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.*●సంజాముల మండలం ముక్కమల్ల గ్రామానికి చెందిన ఎం. సుశీలమ్మ తనకు పీఎం–కిసాన్, ఎన్టీఆర్ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు అకౌంట్‌లో జమ కావడం లేదని తెలుపుతూ, సమస్యను పరిష్కరించవలసిందిగా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.*●దొర్నిపాడు మండలం క్రిస్టిపాడు గ్రామానికి చెందిన పి. శివశంకర్ రెడ్డి సర్వే నెం.350/1లో 0.15 సెంట్లు, సర్వే నెం.350/2లో 1.63 సెంట్లు కలిపి మొత్తం 1.78 సెంట్ల భూమి ఉన్నప్పటికీ, అందులో 1.58 సెంట్లు మాత్రమే ఆన్లైన్‌లో నమోదు అయ్యాయని, మిగతా భూమిని కూడా ఆన్లైన్‌లో ఎంటర్ చేయవలసిందిగా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు.*ఈ కార్యక్రమంలో మొత్తం 292 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికై దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.





