నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):ప్రథమ చికిత్సలో అత్యంత కీలకమైన కార్డియో పల్మనరీ రెససిటేషన్ (CPR) విధానంపై చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. 108 అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండెపోటు, ప్రమాదాలు సంభవించినప్పుడు క్షణాల్లో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ ఎలా ఉపయోగపడుతుందో సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది అయిన ఈఎంటీ (EMT) వెంకటరమణరెడ్డి, గణేష్, పైలట్ నరేందర్ సీపీఆర్ చేసే విధానాన్ని విద్యార్థులకు చేతల్లో (ప్రాక్టికల్‌గా) చేసి చూపించారు. ఊపిరి, స్పృహ లేని వ్యక్తిని గుర్తించడం, ఛాతీపై ఒత్తిడి ఇవ్వడం, కృత్రిమ శ్వాస అందించడం వంటి మెళకువలను వివరంగా నేర్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా ధైర్యంగా స్పందించి 108 సేవలను వినియోగించుకోవాలో కూడా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఇటువంటి కీలకమైన ప్రథమ చికిత్సా పద్ధతులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ శిక్షణ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, తోటి వారికి ఆపద సమయంలో సహాయం చేయడానికి తోడ్పడుతుందని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు..




