Monday, March 2, 2026

ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు దారి తీసేలా విద్యా కమిషన్ నివేదికఉపాధ్యాయుల జీతాలపై వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం: టిపిటిఎఫ్ నేత సుంచు నరేందర్

నేటి సాక్షి గజ్వెల్ : తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం కు సమర్పించిన విద్యా పాలసీ నివేదిక ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలహీనపరచేలా ఉందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ విమర్శించారు.గజ్వెల్ జోన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కమిషన్ నివేదిక పల్లెల్లో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల మూసివేతకు మార్గం సుగమం చేసేలా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాఠశాలల సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు దిశగా కమిటీ పనిచేసిందని ఆయన పేర్కొన్నారు.ఏ కమిషన్ అయినా ప్రత్యామ్నాయ వ్యవస్థను సూచించే ముందు ప్రస్తుత వ్యవస్థలో లోపాలను విశ్లేషించడం అవసరమని, అయితే విద్యా కమిషన్ ఆ బాధ్యతను విస్మరించిందని అన్నారు.విద్యారంగానికి 18 శాతం బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనను స్వాగతించినప్పటికీ, ఉపాధ్యాయుల జీతాలను రేషనలైజ్ చేయాలని, ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని చేసిన సూచనలు ఉపాధ్యాయ వర్గంపై ప్రతికూల దృక్పథాన్ని చూపుతున్నాయని విమర్శించారు.తెలంగాణలో ఉపాధ్యాయుల జీతాలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని కమిషన్ పేర్కొనడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో జీతాలు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు.విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలని పేర్కొనబడిన నేపథ్యంలో, మండలానికి రెండు లేదా మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ప్రతిపాదించడం చట్టస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇందుకోసం రూ.6 వేల కోట్ల కేటాయింపు సాధ్యం కాదని పేర్కొన్నారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన Y. S. రాజశేఖర రెడ్డి సక్సెస్ స్కూల్స్, కిరణ్ కుమార్ రెడ్డి మోడల్ స్కూల్స్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాల పేరుతో విద్యారంగంలో పలు ప్రయోగాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ప్రస్తుత పాఠశాలలకు తగిన నిధులు కేటాయిస్తూ పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని, దశలవారీగా ప్రైవేట్ పాఠశాలలను నియంత్రిస్తూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, వర్గల్ మరియు గజ్వెల్ మండలాల అధ్యక్షులు పర్వతం నర్సయ్య, తాళ్ల నాగరాజు, ములుగు మండల ప్రధాన కార్యదర్శి రాజనర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News