నేటి సాక్షి మహబూబాబాద్ ఫిబ్రవరి 6 మండల కేంద్రంలో ప్రభుత్వానికి చెందిన భూములు అక్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని వెంటనే గుర్తించి కాపాడాలని బీఆర్ఎస్ నాయకుడు బండి రమేష్, కెవిపిఎస్ జిల్లా నాయకుడు మందుల యాకూబ్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, భవిష్యత్తు తరాల అవసరాల కోసం వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు పెరిగిపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి, అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ డిమాండ్లతో బీఆర్ఎస్ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు మండల తాసిల్దార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు నిర్ణయించి, భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు అవకాశం లేకుండా శాశ్వత రక్షణ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాతూరి మధు రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సురేష్, గ్రామ యువకులు కరుణాకర్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొని ప్రభుత్వ భూముల పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.





