నేటిసాక్షి, నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్జరిగినట్టు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే మెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇంచార్జి, మిర్యాలగూడ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి లతో కలిసిజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, హెచ్ ఓడి లు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో ఆమె విడివిడిగా చర్చించారు. మీడియాలో వచ్చిన వార్తల దృష్ట్యా నిజంగా వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలను వివరించాలని ఆమె విద్యార్థులను అడిగారు. తమను ఎవరు ర్యాగింగ్ చేయ లేదని, స్నేహపూర్వక వాతావరణంలోనే తాము ఉన్నామని విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులతో మాట్లాడుతూ, ర్యాగింగ్ అంశాన్ని ప్రభుత్వం చాలా కఠినంగా గా తీసుకుంటున్నదని, ఎవరైతే ర్యాగింగ్ కు పాల్పడతారో వారు చట్టరీత్యా తప్పు చేసిన వారవుతారని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా ప్రతి వైద్య కళాశాలకు మెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా ర్యాగింగ్ కు పాల్పడినా, ర్యాగింగ్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎలాంటి రికమండేషన్లు పనిచేయవని, విలువైన జీవితాన్ని విద్యార్థులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏవైనా సమస్య ఉంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావాలని, ర్యాగింగ్ వంటి వాటికి పాల్పడవద్దని సూచించారు .తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను చదివిస్తారని, ఒక డాక్టర్ గా రాణించేందుకు ఎంతో కష్టపడి నీట్ రాయడంతో పాటు, 5 సంవత్సరాలు ఎంబిబిఎస్ విద్యను అభ్యసించాల్సి ఉంటుందని, సమాజంలో ఒక మంచి డాక్టర్ గా సేవలందించే విషయంపై వైద్య విద్యార్థులు దృష్టి సారించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులను బాధపెట్టకుండా వారి గురించి ఆలోచించాలని ఆమె వారికి హితబోధ చేశారు. ర్యాగింగ్ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. ర్యాగింగ్ చేస్తే కళాశాల నుండి బహిష్కరణకు గురి కావడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదవుతాయని, దీనివల్ల జీవితమే నాశనం అయిపోతుందని తెలిపారు. నల్గొండ వైద్య కళాశాలపై వచ్చిన ర్యాగింగ్ అంశం తీవ్రంగా పరిగణించి సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలించడం జరుగుతున్నదని ఆమె స్పష్టం చేశారు. ఇకపై వైద్య కళాశాలలో ఆకస్మికంగా విద్యార్థుల గదులను తనిఖీ చేయడం జరుగుతుందని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదే సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావాలని, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ లేదా నల్గొండ ఆర్డిఓ కు తెలియజేయాలని సూచిస్తూ, వారి ఫోన్ నెంబర్లను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





