నేటిసాక్షి,:మిర్యాలగూడ : పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు బుధవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ లు మాట్లాడుతూ, పట్టణంలోని ప్రతి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్య హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘన పాల్పడుతూ 25% సీట్లు ఉచితంగా పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికిని ఇవ్వకుండా, మరియు స్కూలు లోనే పుస్తకాలు, నోట్ బుక్స్ యూనిఫామ్, షూస్, బెల్టు, టై లు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అడ్మిషన్ ఫీజు ఒక్కొక్క విద్యార్థికి సుమారు రూ. 5వేలు నుండి రూ.10వేల వరకు వసూలు చేస్తూ, పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నర్సరీ పిల్లవానికి రూ.50 ఫీజులు సంవత్సరానికి, ఒకటవ తరగతి విద్యార్థికి సుమారు రూ.1లక్ష వసూలు చేస్తూ, పేద విద్యార్థుల తల్లిదండ్రులను జలగలా పట్టి పీడిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా నిద్ర అవస్థలో ఉంటున్నారని ఆరోపించారు. వెంటనే సబ్ కలెక్టర్, విద్య శాఖ స్పందించి, తరగతుల వారీగా విద్యార్థులకు తీసుకోవాల్సిన ఫీజుల వివరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటీస్ బోర్డులో పెట్టించి, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరంగి సురేష్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లావురి రవీందర్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు గాదగోని మహేష్ గౌడ్, రాజు, నరేష్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

