-ఆంగ్ల విద్య ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు
-అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి
-ఎన్నారై సామాజికవేత్త చెరుపల్లి శ్రీనివాస్
నేటిసాక్షి, మిర్యాలగూడ : విద్యార్థులు ఉపాధ్యాయులను ప్రశ్నించడం ద్వారా అద్భుతాలు సృష్టించడం సాధ్యమవుతుందని ఎన్నారై, సామాజికవేత్త చెరుపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు లక్ష రూపాయలు విలువగల నోటు పుస్తకాలు, పెన్నులు తోపాటు పాఠశాలకు రెండు కంప్యూటర్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలగా గుర్తింపు పొందిన సరస్వతి విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాయన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల విద్యను అభ్యసించడం తప్పనిసరి అయినప్పటికీ దేశభక్తిని, ధర్మాన్ని, సంఘసేవను మర్చిపోవద్దని గుర్తు చేశారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అవకాశాల కోసం మనం ఎదురు చూడవద్దని వాటిని మనమే సృష్టించుకోవాలని తెలిపారు. ఒకరి వద్ద పనిచేసే స్వభావాన్ని విడనాడి పదిమందికి మనం పని కల్పించే విధంగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకొని, విద్యార్థులు చదువుకోవాలని అందులో విజేతలు కావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో రోజుకు కొంత సమయాన్ని కేటాయించి వారితో గడపాలని అప్పుడే పిల్లల్లో చెడు స్వభావం దరిచేరదని తెలిపారు.
పాఠశాల సమితి ప్రధాన కార్యదర్శి యామిని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా గట్టుప్పల్ ప్రాంతానికి చెందిన ఎన్నారై చెరుపల్లి శ్రీనివాస్స్ మిర్యాలగూడ లోని శిశుమందిర్ కు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. దాతలు ఇచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సమితి సభ్యులు గూడూరు శ్రీనివాసరావు, ప్రధానాచార్యులు చెన్నూరు రవికుమార్, గట్టుపల్ ప్రధానోపాధ్యాయుడు నరేష్ తో పాటు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

