నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య )**’ప్రాణాలతో తిరిగి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు..’ అనే ఒక్క వాక్యం వెనుక నాలుగు దశాబ్దాల అజ్ఞాతం, పోరాటం, త్యాగం, జ్ఞాపకాల భారమంతా దాగి ఉంది.! 1983లో ఉద్యమబాట పట్టి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, దాదాపు 47 ఏళ్ల తర్వాత అజ్ఞాతాన్ని వీడి సొంతూరు కోరుట్లకు చేరుకోవడం స్థానికంగా కాక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఆయన ఇటీవల సహచరులతో కలిసి లొంగిపోయి, ఇప్పుడు తన పుట్టిన ఊరి నేలపై అడుగుపెట్టడం భావోద్వేగ క్షణాలకు నాంది పలికింది..!”**స్వగృహ ప్రవేశం – భావోద్వేగాల వెల్లువ.!*జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ బుధవారం సాయంత్రం తన స్వగృహానికి చేరుకోవడం పట్టణంలో ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించింది.! హైదరాబాద్ కు వెళ్లిన ఆయన తమ్ముడు తిప్పిరి గంగాధర్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆయనను రిసీవ్ చేసుకుని కోరుట్లకు తీసుకువచ్చారు. సుమారు 45-47 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సొంతూరులో అడుగుపెట్టిన ఆయన రాకతో కోరుట్ల పట్టణమంతా భావోద్వేగంతో నిండిపోయింది. ఊరికి చేరుకున్న వెంటనే తన పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి స్వర్గస్తులైన తల్లిదండ్రుల ఫోటోలకు నివాళులు అర్పించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అనంతరం బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో ఆప్యాయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి స్వాగతం పలికారు. చిన్ననాటి స్నేహితులు, బంధువులను చూసి దేవ్ జీ భావోద్వేగానికి లోనయ్యారు. తనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కలవడం తనకు అపూర్వ అనుభూతినిచ్చిందని తెలిపారు.*’మళ్లీ వస్తానని కలలో కూడా అనుకోలేదు..’ – దేవ్ జీ వ్యాఖ్యలు.!*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవ్ జీ మాట్లాడుతూ.. తాను ఉద్యమబాటలో వెళ్లిన తర్వాత మళ్లీ సొంతింటికి వస్తానని కలలో కూడా అనుకోలేదని స్పష్టం చేశారు. ‘ప్రాణాలతో బయటకు వస్తానని కూడా ఊహించలేద’ని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఇదే మొదటిసారి సొంత ఊరికి రావడం జరిగిందన్నారు. తనను కలవడానికి వచ్చిన చిన్ననాటి మిత్రులు, బంధువులు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించారని తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా తాను చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే గతంలో మీడియా సమావేశంలో వెల్లడించానని, ప్రస్తుతం కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలవడానికి మాత్రమే వచ్చానని పేర్కొన్నారు. మరోవైపు, దోపిడీ, పీడనలేని సమ సమాజ నిర్మాణం కోసం అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లానని, ఆర్థిక, సామాజిక, కుల, మత అసమానతలు లేకుండా సమాజం ఉండాలని ఇప్పటికీ అదే భావన కొనసాగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల కోసం పని చేస్తానని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని భావిస్తున్నానన్నారు.*ప్రజాజీవితంలో కొనసాగుతా – భవిష్యత్ దిశపై సంకేతాలు.!*మావోయిస్టుగా అజ్ఞాత జీవితం వదిలినప్పటికీ..తాను ఇకపై వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా ప్రజాజీవితంలో కొనసాగుతానని దేవ్ జీ స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తానని, కోరుట్ల పట్టణమే తన ఇంటిలా భావిస్తున్నానని పేర్కొన్నారు. గురువారం మరింత మంది పట్టణ ప్రజలను కలిసే కార్యక్రమం ఉందని తెలిపారు. తనపై నమ్మకంతో, అనుబంధంతో ఉన్న వారందరినీ వ్యక్తిగతంగా కలుసుకోవడం తన ప్రధాన ఉద్దేశమన్నారు. ఇదిలా ఉండగా, అజ్ఞాతంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన తన తమ్ముడి కూతురు తిప్పిరి సుమ గురించి కూడా స్పందిస్తూ..ఆమె అభిప్రాయాలు అజ్ఞాతంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల భావోద్వేగాల ప్రతిబింబంగానే భావించామని అన్నారు. తనతో పాటు సహచరుల గురించి కూడా ఆమె రాసిందని అనుకున్నామని వ్యాఖ్యానించారు. మొత్తంగా నాలుగు దశాబ్దాల వనవాసం అనంతరం సొంతూరికి చేరుకున్న దేవ్ జీ రాక కోరుట్లలో మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన భవిష్యత్ అడుగులు ఎలా ఉంటాయన్నదానిపై అందరిలోనూ ఇప్పుడు ఆసక్తి నెలకొంది..!!______________________





