నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా అధికారులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా లేదా రిజిస్ట్రేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడిపే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా పరిపాలన సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.సోమవారం జగిత్యాల జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఛాంబర్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది పేర్లతో మాత్రమే వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఏ డాక్టర్ లేదా సిబ్బంది వెళ్లిపోయినా లేదా కొత్తగా జాయిన్ అయినా వెంటనే ఆ వివరాలను రిజిస్ట్రేషన్‌లో అప్డేట్ చేయించుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ చట్టంలోని ప్రతి నిబంధనను అన్ని ఆసుపత్రులు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.*నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు*జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ..నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై జరిమానాలు, లైసెన్స్ రద్దు, చట్టపరమైన చర్యలతో సహా తీవ్రమైన శిక్షాత్మక చర్యలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నియంత్రణలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రోగ్రాం ఆఫీసర్లకు డివిజన్ల వారీగా ఆసుపత్రులను కేటాయించి, నిరంతర తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ తనిఖీల ద్వారా రిజిస్ట్రేషన్ స్థితి, సిబ్బంది వివరాలు, సౌకర్యాల నాణ్యత, చట్టపరమైన అనుమతులు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించనున్నారు.ఈ సమావేశంలో డిఎస్పీ స్పెషల్ బ్రాంచ్ వెంకటరమణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పర్యవేక్షకులు కుతుబుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ తరాల శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నాస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు తమ రిజిస్ట్రేషన్ స్థితిని వెంటనే తనిఖీ చేసుకొని, అవసరమైన అప్డేట్లు, సరిదిద్దులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ చర్యల ద్వారా జిల్లాలో నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు జిల్లా పరిపాలన నిబద్ధతతో ఉందని స్పష్టమవుతోంది.____





