నేటిసాక్షి, కరీంనగర్:ఆ పాఠశాల క్రీడామైదానంలో మైకుల జోరుతో విద్యార్థులు బేజారవుతున్నారు. పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మైదానంలో కాసుల కోసం పైవేటు క్రికెట్ టోర్నమెంట్లకు అనుమతిస్తున్నారు. తరగతి వేళల్లో వారు మైకులతో చేస్తున్న భారీ కామెంటరీ శబ్దాలతో విద్యార్థులు సరిగ్గా చదువులు కొనసాగించలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.కరీంనగర్లోని సెయింట్ అల్ఫోన్స్ స్కూలులో నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ క్రికెట్ టోర్నమెంట్ విమర్శలకు దారితీస్తోంది. పాఠశాలలో తరగుతులు నిర్వహించాల్సిన సమయంలో భారీ మైకులు ఏర్పాటుచేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తున్నారు. సదరు ప్రైవేటు టోర్నమెంటు నిర్వహణకు గాను ఒక్కో మ్యాచుకు 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పాఠశాల యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా చేస్తున్న ఈ వ్యవహారంతో తమ పిల్లలు చదువును సరిగ్గా కొనసాగించలేని పరిస్థితి దాపురించిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు, శారీరక ధృడత్వం కోసం ఉపయోగించాల్సిన మైదానాన్ని డబ్బుల కోసం ప్రైవేటు కార్యకలాపాల కోసం వినియోగించడం శోచనీయం. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయమై కరీంనగర్ ఎంఈఓను ఫోన్లో సంప్రదించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

