Monday, January 19, 2026

బీడీలోల్ల కష్టాల ‘జిందగీ’!!

  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దయనీయమైన బీడీ కార్మికుల ‘బతుకులు’.!
  • ఇంటిల్లిపాది బీడీలు చుట్టుకునే పొట్ట పోసుకుంటుంటారు.!!
  • కష్టాల ‘జిందగీ’ని. సమిష్టిగా..సంబరంగా..కడెల్లదీస్తుంటారు.!!!

“ఆరేడు గొట్టంగ మరదలా.!
నువ్ బీడీలు చుట్టంగ మరదల..మరదల..!
తమ్మలపాకేశి మరదల..మరదలా..
నువ్-శాట్ల తంబాకు వొయ్యంగ మరదల..మరదలా..”
అంటూ గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్ల ‘జానపద గేయాల్లో’ తమ ‘బతుకు గాయాలు’ కనిపించకుండా ‘బావా-మరదల్లు’ సరసాలాడుకుంటూ గమ్మత్తైన పాటలు పాడుకునేవారు.అలా పాటలు పాడుకుంటూ తమ పని తాము చేసుకుంటూ పొట్టపోసుకునే తెలంగాణ ‘బీడీ కార్మికుల బతుకుల’పై ప్రత్యేక కథనం.!!

కన్నీటిలో నానే ఆకుపూడలు
కంపిని సేటు..
దగ్గర హజారు ఆకు
ఏపిచ్చుకచ్చుకునుడు తోని..
బీడీ కార్మీకుల ‘జిందగీ’ మొదలవుతుంది.!
కారటు మీద..
ఆకు..తంబాకు..దారం పొట్టె..
రాపిచ్చుకుని ఇంటికచ్చి ఆకుపూడల్ని..
నీళ్లలో నానవెట్టి ఇంటిపనులు..వంట పనులు చేసుకుంటరు.!!
మార్కెట్లో..
చాట..గుల్ల..కత్తెర..
కంపిన్ల బీడికి సరిపడ పత్ర..
బీడి కట్టకు సరిపడ సాంచెలను..
తెచ్చుకుంటరు.
వంటయ్యక పత్ర కొల్తతో
ఆకు కత్తిరించుకుంటరు.బొంత కట్టుకుని..
బండగింద అణ్గవెట్టి తంబాకు తెచ్చుకుని..
పగటీలు తిన్నంక బీడీలు చుట్టుడు మొదలెడతారు.!!
సాయంత్రం..
ఇంటిపని..వంటపని..
పిల్లల హోంవర్కు అయ్యాక..
ఇంత ఛాయిబొట్టు దాగి కూసొంటే..
రాత్రి పదకొండు దాక వెయ్యి బీడీలు చుట్టి పెడతారు.
తెల్లారి పొద్దుగల్లటి పనులయ్యాక బీడి కట్టలు
కట్టేసుడు ఛాల్ జేస్తరు.తొమ్మిది గంటలకు కంపిన్లకు
మాపు కొండవోతరు.కారటు మీద రాయించుకుంటరు.
ఇదీ వారి రోజు దిన చర్య..దీంట్ల మార్పేమి ఉండదు.!!

సేటంటే గజ్జుమంటరు.!

ఆకు తుట్టి వోయినా..
బీడీల్లో తంబాకు సరిగా పోయకున్నా..
కట్టలు సరిగా కట్టడం రాకున్నా..లాసైయ్యేది..
పాపం..బీడీకార్మికులే.నోటికచ్చిన బూతులు తిడతారు.
వీళ్లు మూసుకుని భరిస్తారు.మొగుడికి భయపడరు గని
సేటంటే గజ్జుమంటరు.!!

సేట్ల దోపిడి ‘గుల్లకట్ట’తో..షురూ.!

నీకు
బీడీలు సరిగ చేయడం
రావట్లేదని ‘గుల్లకట్ట’తీస్కుంటరు.
సుమారు వంద మంది నుండి వంద గుల్లకట్టల్ని
సేటు భార్య పేరిట ‘మాపు’రాసుకుంటడు.ఇవేం
బీళ్లు చేయడమని కట్టలు తెంపేస్తడు..అవీ సేటుకే..
వీళ్లు నోరు మెదుపరు.!!
మూణ్ణెళ్లు ‘మజూరు’ ఆపుకుని
ఒక్కనెలది ఇస్తాడు.రెణ్ణెళ్ల పైసలు వడ్డీలకు
తింపుకుంటడు.వీళ్లబతుకులు ఎక్కడేసిన
గొంగళి అక్కడే అన్నట్టు అధ్వానంగనే ఉంటయ్ గనీ..
కంపెనీ సేట్లు మాత్రం ధనికులవుతారు.ఇదేమని అడిగితే ‘కట్’చేసేస్తారు.ఆ పూట గడవాలంటే..’వొడ్ది’కి బీడీలు చేసుకుని..డబ్బులు తెచ్చుకుంటరు.ఇలా కూడా సేట్లకే లాభం.!!

ఖార్కానాలో ‘పొన్న’వట్టి చేసెటోల్లు.!

ఇరవై ఏండ్ల కిందటి వరకు..
కంపిని సేటు దగ్గర ఖార్ఖాన లో..
బీడీ కార్మికులు వరుస క్రమంలో కూసుని..
ఆడుతు పాడుతూ సామూహికంగా పని చేసుకునెటోళ్లు.
ఉయ్యాల పాటలు..శ్రమ జీవన పాటలు..పల్లె బంధాల విలువ తెలిపే పాటలు శ్రమను మర్చిపోయేలా పాడుకుంటూ పని చేసుకునెటోళ్లు..!!
ఇప్పుడు..
ఖార్కాన్లు బందైనై..
టీవీ సీరియళ్లే దిక్కైనై..
కంపిని సేట్ల దోపిడేం ఆగలేదు..
బీడీకార్మీకుల ‘జిందగీ’లో మార్పేమీ రాలేదు.!!


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News