నేటి సాక్షి, బెజ్జంకి:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని మాజీ జడ్పీటీసీ కనగండ్ల కవిత తిరుపతి విమర్శించారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ, గతంలో తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి రిజర్వేషన్లు అమలు కాలేదని తెలిసికూడా కాంగ్రెస్ నాయకులు బీసీలకు అబద్ధపు హామీలు ఇస్తూ మభ్యపెడుతున్నారని అన్నారు. ఒక బీసీ మహిళా మంత్రి అయిన కొండా సురేఖకు న్యాయం చేయలేని ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు న్యాయం చేస్తుందా? అని ప్రశ్నించారు.రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించినా మిల్లులు కేటాయించకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. వాతావరణం అనుకూలించక వర్షాలు పడకపోవడంతో వరి ధాన్యం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.“రైతుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి, మిల్లులకు ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలి” అని కవిత తిరుపతి డిమాండ్ చేశారు.




