నేటి సాక్షి, ఎండపల్లి:* కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల నాన్చుడు వైఖరి వీడానాడి రాబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనైనా 42% రిజర్వేషన్లు అమలు చేసి, చట్టబద్ధత కల్పించి ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎలుక భగవాన్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల డిక్లరేషన్ లో హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు చేయకుండా జాప్యం చేయడం సరికాదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై జిఓ 9 తీసుకువచ్చి గవర్నర్, రాష్ట్రపతి లకు పంపి, దాన్ని రద్దు చేసి జిఓ 46 తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించడం బీసీలకు నమ్మక ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. బీసీలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలని ఎన్ని పోరాటాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి” చేయి” చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లకు అడ్డురాని సుప్రీం కోర్టు నిబంధన బీసీ లకు మాత్రం అడ్డు రావడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షులు కనువిప్పు చేసుకుని, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో చట్టబద్ధతో కూడిన బీసీ రిజర్వేషన్ల అమలుకై కృషి చేయాలని డిమాండ్ చేశారు.





