నేటి సాక్షి 12 జనవరి ఆత్మకూరు:-బ్రిటిష్ వారిపై వడ్డె ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ డి.నాగన్న, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని, బీసీ సంఘం కార్యాలయంలో రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య, ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల తిమ్మయ్య, ఏపీ వడ్డెర యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు మౌలాలి, సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామాజిక వేత్త డాక్టర్ డి.నాగన్న, రామకృష్ణ, వీరన్న, వెంకటస్వామి గౌడ్, ఈ.శివన్న గౌడ్, రమణ, శివ తదితరులు వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, వడ్డె ఓబన్న పోరాట స్పూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామజిక వేత్త డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న స్ఫూర్తిని బీసీలు ఆదర్శంగా తీసుకొని తమ హక్కుల కోసం ఉద్యమించాలని అన్నారు. బీసీలు సంఘటితమై అందులోని కులాల హక్కులు ఐక్యమత్యంతో సాధించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి బీసీలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య మాట్లాడుతూ వడ్డె ఓబన్న 1807, జనవరి-11న నంద్యాల జిల్లాలోని, సంజామల ప్రాంతంలో రేనాటి గడ్డపై జన్మించారని, ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కి సైన్యానికి సైన్యాధ్యక్షునిగా ఉంటూ రైతు బట్వారీ వ్యవస్థపై బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి వీరమరణం పొందారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న బోయలను, చెంచులను, అణగారిన వర్గాలను సమన్వయం చేసుకొని బ్రీటీష్ పాలకులపై పోరాటాల చేసి ధీటుగా బదులిచ్చిన వీరుడని కొనియాడారు. వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకొని వడ్డెరులు తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని సూచించారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. వడ్డెరులు ఐక్యమత్యంతో మెలగాలని, వడ్డె ఓబన్న విగ్రహాలను ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు చంద్రగిరి మల్లేష్, పల్లపు హుశేనయ్య, బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ సింగ్, శ్రీహరి, పెద్దన్న, శ్రీరామ్, శివపాములేటి, వెంకటేశ్వర నాయక్, ఆత్మకూరు డివిజనల్ ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దూదేకుల మీరాసాహెబ్,మరాఠి సంఘం జిల్లా అధ్యక్షులు రేకంధర్ సాయికృష్ణ, వైసీపీ నాయకులు మాబాష, తదితరులు పాల్గొన్నారు.

