నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణ పరిధిలో బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోరుట్ల సీఐ బి. సురేష్ బాబుతో కలిసి ఎస్.ఐ. కోరుట్ల ఆధ్వర్యంలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.*మోహన్ రావు పేట్, వెంకటాపూర్ ఎక్స్ రోడ్‌లలో చర్యలు*ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పరిధిలోని మోహన్ రావు పేట్, వెంకటాపూర్ ఎక్స్ రోడ్, అలాగే SFS స్కూల్ పరిసరాలు వంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్‌ల వద్ద రోడ్డుపైన పోలీస్ స్టాపర్స్‌ను ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.*గ్రామస్తులు, వాహనదారులతో అవగాహన*ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు, వాహనదారులతో పోలీసులు నేరుగా మాట్లాడారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టంగా సూచించారు.*పోలీసు సలహాలు పాటించాలి*రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసు శాఖ ఒక్కటే కృషి చేస్తే సరిపోదని, ప్రజల సహకారం అత్యంత అవసరమని సీఐ సురేష్ బాబు తెలిపారు. పోలీసు వారు అందిస్తున్న సలహాలు, సూచనలను తప్పక పాటిస్తూ, రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.*ప్రమాద రహిత కోరుట్ల లక్ష్యం’అరైవ్-అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రమాద రహిత కోరుట్లను లక్ష్యంగా పెట్టుకొని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవిలు తెలిపారు. ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు._______

